అంబేద్కర్ అందరికీ రోల్ మోడల్ : వివేక్ వెంకటస్వామి

  • ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి: వివేక్ వెంకటస్వామి
  • ఎంతో ముందుచూపుతో రాజ్యాంగం రాశారని వెల్లడి

ముషీరాబాద్, వెలుగు: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ద్వారా దళితులు దేశానికి ఎంతో మేలు చేశారని ఆయన మన అందరికీ రోల్ మోడల్ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. అందరికీ దిక్సూచి లాగా దారి చూపిన అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలని కోరారు. అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా వివేక్​మాట్లాడుతూ అంబేద్కర్ చదువుకున్న రోజుల్లో కుల వివక్ష విపరీతంగా ఉండేదన్నారు. అయినా వెనుకడుగు వేయకుండా మంచిగా చదువుకొని 23 డిగ్రీలు సాధించారని తెలిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని రాయాలని అంబేద్కర్ ను కోరిందన్నారు. చాలా ముందుచూపుతో రాబోయే రోజుల్లో ఉత్పన్నమయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని రాసి దేశానికి అందించారని కొనియాడారు. వారు రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని గుర్తు చేశారు. అంబేద్కర్ ను ప్రతినిత్యం గుర్తుచేసుకుంటూ యువకులు పట్టుదలతో ముందుకు వెళ్లాలని సూచించారు.

జాతి ఐక్యత కోసం అందరు పాటుపడాలి

జాతి ఐక్యత కోసం అందరూ పాటుపడాలని వివేక్ వెంకటస్వామి సూచించారు. దళిత హక్కుల రక్షణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు భోనగిరి మంగ ఆధ్వర్యంలో శుక్రవారం రాంనగర్ లోని వైయస్సార్ పార్క్ వద్ద అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన వివేక్ మాట్లాడుతూ.. అంబేద్కర్ మన కోసం ఆలోచించి రాజ్యాంగంలో హక్కులు కల్పించారని కొనియాడారు. మనం ఈ స్థాయిలో ఉన్నామంటే అది రాజ్యాంగం ద్వారానే అని మర్చిపోవద్దని చెప్పారు.

ఇటీవల మాలల సింహగర్జన అద్భుతంగా జరిగిందని ఇతర కులాల వారు మనల్ని అప్రిషియేట్ చేస్తున్నారని చెప్పారు. వారు సభ నిర్వహించాలంటే మన సభను ఆదర్శంగా తీసుకునేలా మీరంతా తరలి రావడమే ఇందుకు కారణమన్నారు. ఇదే ఐక్యతను ఇకముందు కూడా కొనసాగిస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో మాల కులాల యునైటెడ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మాస్టర్ దయానంద్, నర్మేట మల్లేశ్, నాగెల్లి కృష్ణ, కే రమేశ్, నీలం పద్మారావు తదితరులు పాల్గొన్నారు.