గద్దర్ పాట తెలంగాణ ఉద్యమానికి ఊపిరి :  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

గద్దర్ పాట తెలంగాణ ఉద్యమానికి ఊపిరి :  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • ఆయన పేరుతో ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం అభినందనీయం: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్/ బషీర్​బాగ్​​, వెలుగు: తెలంగాణ ఉద్యమానికి గద్దర్ పాట ఊపిరి పోసిం దని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నా రు. ఆయన పేరుతో ప్రభుత్వం సినిమా అవార్డులు ఇవ్వడం అభినందనీయమన్నారు. గద్దర్, పైడి జైరాజ్‌‌, కత్తి కాంతారావు పేర్లతో సినిమా అవార్డులు ప్రకటించిన సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గురువారం ఫిలిం చాంబర్‌‌‌‌లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వివేక్ వెంకటస్వామి ముఖ్య​అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గద్దర్‌‌‌‌తో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. సూర్యాపేట జిల్లాకు చెందిన కాంతారావు మంచి కళాకారుడని తెలిపారు. తెలంగాణ నటుల పేర్లతో అవార్డులు ఇస్తున్నందుకు సీఎం రేపంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ‘‘ఉద్యమ సమయంలో వీ6 పాత్ర మరువలేనిది. తెలంగాణ మాట, పాటను వీ6 చానెల్ ముందుకు తీసుకొచ్చింది.

వీ6ను వ్యాపార దృక్పథంతో నడపొద్దని దాన్ని ప్రారంభించినప్పుడు నేను, చీఫ్ ఎడిటర్ అంకం రవి అనుకున్నాం. ఉద్యమంతో పాటు బతుకమ్మ, బోనాలు సహా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన పలు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో  వీ6ను జనం ఓన్ చేసుకున్నారు. తెలంగాణ గొంతుకగా గుర్తించారు” అని పేర్కొన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా కాకాను గుర్తు చేస్తారని, ఆయన కొడుకుగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

‘‘పైడి జైరాజు పేరుతో పంజాల జైహింద్ గౌడ్‌‌ ఏడేండ్లుగా కార్యక్రమాలు చేయడం అభినందనీయం. తెలంగాణ ఆర్టిస్టులకు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని జైహింద్ గౌడ్ చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను” అని అన్నారు. జై తెలంగాణ ఫిలిం జేఏసీ చైర్మన్ పంజాల జైహింద్ గౌడ్‌‌, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. 

దళితుల హక్కుల కోసం కొట్లాడ్త.. 

దళితుల హక్కుల కోసం కొట్లాడేందుకు ముందుంటానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మాస్టార్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ‘మా భారత భాగ్య విధాత అంబేద్కర్’ ఆడియో, వీడియో ఆవిష్కరణ సభ నిర్వహించారు. ఈ సభకు వివేక్ హాజరై మాస్టార్జీ రచించి, పాడిన పాటను ఆవిష్కరిం చి మాట్లాడారు. గత 30 ఏండ్లుగా మాస్టార్జీతో తనకు అనుబంధం ఉందని, ఆయన పాటలు దళితులకు ధైర్యం కలిగించేలా ఉంటాయని ఆయన అన్నారు.

దళితుల అభ్యున్నతి కోసం తన తండ్రి వెంకటస్వామి ఎంతో కృషి చేశారని.. అదే సంప్రదాయాన్ని తాము కొనసాగిస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థుల కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థలను ఏర్పాటు చేసి.. కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామన్నారు. తమ విద్యాసంస్థల్లో 75 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నామన్నారు. దళితుల ఆత్మగౌరవం కోసం 18 శాతం రిజర్వేషన్లు కోరినట్టు వివరించారు. దళితులు ఆర్థికంగా ముందుకెళ్లినప్పుడే కుల వివక్షను ఎదుర్కోరని తెలిపారు.