- పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలే: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచాం
- ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని వెల్లడి
- మందమర్రి మండలంలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ
కోల్‌బెల్ట్/చెన్నూరు, వెలుగు: దేశంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా రైతులకు ఒకే దఫా రూ.2లక్షల రుణమాఫీ అమలు చేయలేదని, తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ మాత్రమే చేసి రైతులకు అండగా నిలిచిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, మందమర్రి, కాసీపేట మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. మందమర్రి మండలంలో రూ.1.57 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైయినేజీల నిర్మాణపనులకు భూమిపూజ చేశారు.
చెన్నూరులోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్‌ను మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. గత పాలకులు గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. జనవరి నుంచి పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కృషిచేస్తున్నామని వెల్లడించారు.
మెరుగైన వైద్య సేవలకు కృషి..
చెన్నూరులోని వార్డుల్లో రూ.12 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు సాగుతున్నాయని ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. చెన్నూర్ పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు అంశాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఇప్పటికే చెన్నూరు ఆస్పత్రికి డయాలసిస్‌సెంటర్ మంజూరు చేయించానని, రోగుల ట్రాన్స్పోర్ట్ కోసం రెండు అంబులెన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చానని తెలిపారు.
భీమారం మండలానికి త్వరలోనే 108 అంబులెన్స్ సర్వీసును ప్రారంభిస్తామన్నారు. చెన్నూర్ మండలం సోమనపల్లిలో రూ.125 కోట్లతో త్వరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు చేపడుతామన్నారు. చెన్నూరులో ఎస్సీల కోసం అంబేద్కర్ భవన్, నేతకాని భవన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. మందమర్రి మండలంలో రూ.1.20 కోట్ల డీఎంఎఫ్టీ ఫండ్స్‌తో అభివృద్ధి పనులు నడుస్తున్నాయన్నారు. మరో రూ.1.57 కోట్ల ఫండ్స్‌ను కేటాయించి గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైయినేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని వివేక్ తెలిపారు.
లయన్స్ క్లబ్ సేవలు పేదలకు ఎంతో ఉపయోగం..
లయన్స్ క్లబ్ అందిస్తున్న సామాజిక సేవలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూరు ప్రజలకు వైద్య సేవలు అందించేదుకు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి రామగుండంలో బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసేందుకు రూ.10 లక్షల ఫండ్స్మంజూరు చేశారని.. అయితే, దానికి అప్రూవల్రాకపోవడంతో ఆగిపోయిందన్నారు.
బ్లడ్‌బ్యాంకు బదులు జైపూర్ ఆర్టిఫిషియల్ లెగ్స్ పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయడంతో ఎంతో మంది బాధితకులకు ఉపయోగపడుతోందన్నారు. గోదావరిఖని, మంచిర్యాలకు చెందిన అన్ని రకాల సెష్పలిస్టు డాక్టర్లు సుమారు 850 మందికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వయంగా ఎమ్మెల్యే వివేక్ పలువురికి వైద్య పరీక్షలు చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం అధ్యక్షుడు మల్లికార్జున్, సెక్రటరీ ఎల్లప్ప, ట్రెజరర్ గోవర్ధన్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, మందమర్రి తహసీల్దార్ సతీశ్ కుమార్, లయన్స్ క్లబ్ మెంబర్లు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.