- అర్హులందరికీ ప్రభుత్వం కార్డులు ఇస్తుంది: వివేక్ వెంకటస్వామి
- చెన్నూరు నియోజకవర్గంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాం
- మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
కోల్‌బెల్ట్/చెన్నూరు/జైపూర్, వెలుగు: రేషన్ కార్డుల పంపిణీపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రేషన్ కార్డులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం చెన్నూరు నియోజకవర్గంలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని, మాట్లాడారు. రేషన్ కార్డు లిస్టులో పేర్లు రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత ఉన్నోళ్లకు కార్డులు వస్తాయని తెలిపారు.
మందమర్రిలో రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల్లో 546 మందిని అర్హులుగా ఆఫీసర్లు గుర్తించారన్నారు. అలాగే, మున్సిపాలిటీ పరిధిలో 560 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలోనే అర్హులను గుర్తించేందుకు తయారు చేసిన లిస్టుల్లోని పేర్లపై స్థానికులు అభ్యంతరం చెప్పడంతో, ఇప్పుడు మళ్లీ ఇండ్ల కేటాయింపునకు మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ల నేతృత్వంలో సర్వే చేసి 243 మందిని అర్హులుగా గుర్తించారన్నారు.
మరోవైపు, చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని వివేక్ అన్నారు. మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రోగ్రెస్‌పై మున్సిపల్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. అభివృద్ధి పనులను నెల రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్వర్లు, గద్దె రాజు, క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ జంగం కళ, ఆఫీసర్లకు సూచించారు. భీమారం మండలం లాల్‌బహదూర్ పేట గ్రామంలో రూ.5 లక్షల సీఎస్సాఆర్ ఫండ్స్‌తో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జైపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
హామీలు నెరవేస్తున్నం..
ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రయారిటీ పరంగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్ హయాంలో మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని గుర్తుచేశారు. రోడ్లు, సైడ్ డ్రైనేజీలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, తాను ఎమ్మెల్యే అయ్యాక ప్రయారిటీ ప్రకారం వీటి నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చెన్నూరు నియోజకవర్గం పరిధిలో డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ ఫండ్స్ రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు నడుస్తున్నాయని వెల్లడించారు.
80 శాతం పనులు కంప్లీట్ అయ్యాయని, మిగిలినవి త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. మందమర్రి మున్సిపాలిటీలో అమృత్స్కీం ద్వారా రూ.30 కోట్లతో ఇంటింటికి వాటర్ సప్లై కోసం పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో చెన్నూరు నియోజకవర్గాన్ని నంబర్‌వన్‌గా మారుస్తానన్నారు. జైపూర్‌లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
తాను హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంత యువతలో క్రీడలను ప్రోత్సహించానని చెప్పారు. మందమర్రి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని చాలా మంది అడుగుతున్నారని, అందుకోసం కృషి చేస్తానన్నారు. అంతకు ముందు చెన్నూరు మున్సిపాలిటీలో నిర్వహించిన మార్నింగ్ వాక్‌లో భాగంగా వివేక్ వెంకటస్వామి వార్డుల్లో పర్యటించి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు.