
- బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లే ఇవ్వలె: ఎమ్మెల్యే వివేక్
- బెల్లంపల్లిలో ఎక్స్ప్రెస్రైళ్ల హాల్టింగ్‌కు కృషి చేస్తం
- వేలాల జాతరలో భక్తులకు అన్ని సౌలత్లు కల్పించాం
- బెల్లంపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ వెంకటస్వామి
కోల్‌బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంలో బీఆర్ఎస్ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇన్నేండ్లుగా నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూడాల్సి వచ్చిందన్నారు.
మంగళవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న జాతర, చెన్నూరు గోదావరి ఉత్తరవాహిని వద్ద భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లు, మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో ఊరుమందమర్రిలో అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన తర్వాత 54వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 2లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ప్రతి నెల ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నట్టు చెప్పారు. మంచిర్యాలలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నిరుద్యోగుల్లో ఉత్సాహం నింపిందని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి గెలుపు ఖాయమన్నారు.
కొత్త అండర్ గ్రౌండ్మైన్స్, జైపూర్ ఎస్టీపీపీలో 800 మెగావాట్ల మూడో యూనిట్ అందుబాటులోకి వస్తే కొత్తగా ఉపాధి లభిస్తుందన్నారు. ఊరుమందమర్రిలో రూ.50 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైయినేజీ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.
వేలాల జాతరకు అన్ని ఏర్పాట్లు చేశాం
మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26, 27 తేదీల్లో జైపూర్ మండలం వేలాల గట్టు మల్లికార్జునస్వామి జాతర కోసం 15 రోజులుగా వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివేక్ వెంకటస్వామి తెలిపారు. తాను, కలెక్టర్స్వయంగా జాతర ఏర్పాట్లు, భక్తుల కోసం కల్పిస్తున్న సదుపాయాలను పర్యవేక్షించినట్టు చెప్పారు.
ఈసారి వీఐపీ వెహికల్స్‌ను గట్టుపైకి అనుమతించడంలేదన్నారు. చెన్నూరులోని గోదావరి నది ఉత్తరవాహిని ప్రాంతంలో కూడా భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్భంగా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ప్రత్యేక అధికారి విద్యాసాగర్, దేవాదాయశాఖ, ఫారెస్ట్ ఆఫీసర్లతో ఆయన జాతర ఏర్పాట్లపై చర్చించారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు కృషి చేస్తం
బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్, ఇతర సమస్యల పరిష్కారం కోసం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి కృషి చేస్తామని బెల్లంపల్లి, చెన్నూ రు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ వెంకటస్వామి చెప్పారు.
బెల్లంపల్లి మండలం కన్నాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి మద్దతుగా వారు ప్రచారం చేశారు. బెల్లంపల్లిలో ఇంజనీరింగ్ కాలేజ్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తామని, వేమనపల్లి,చెన్నూరు రోడ్డు నిర్మాణానికి నెల రోజుల్లో ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకవచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. కొత్త అండర్ గ్రౌండ్ గనుల ఏర్పాటుకు ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు
40 ఏండ్ల కల సాకారం
బెల్లంపల్లి మండలం కన్నాల క్రాస్ నుంచి బుగ్గగుట్ట రాజరాజేశ్వరస్వామి ఆలయానికి వెళ్లేందుకు రూ.2 కోట్లతో నిర్మించిన రోడ్డుకు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ వెంకటస్వామి పూలు చల్లి పాలతో అభిషేకం చేశారు.
వివేక్ మాట్లాడుతూ 40ఏండ్లుగా రోడ్డు లేక గ్రామస్తులు, భక్తులు ఇబ్బంది పడ్డారన్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్ అటవీ పర్మిషన్లు తీసుకవచ్చి రోడ్డును నిర్మించారన్నారు. 40ఏండ్ల గ్రామస్తుల కల సాకారం కావడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. కాకా కుటుంబం పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు ఎల్లప్పుడు సేవలు చేస్తుందన్నారు.