- 15 రోజుల్లో పత్తి కొనుగోళ్లు పూర్తి చేస్తం
- ఇప్పటికే మంచిర్యాల కలెక్టర్‌ను ఆదేశించానని వెల్లడి
కోల్‌బెల్ట్, వెలుగు: పత్తి కొనుగోళ్ల విషయంలో చెన్నూరు రైతులు ఆందోళన చెందవద్దని, సీసీఐ కార్పొరేషన్ ఆఫీసర్లు 15 రోజుల్లోగా కొనుగోళ్లు పూర్తి చేస్తారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. పత్తి కొనుగోళ్లపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చెన్నూరు నియోజకవర్గ రైతులకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని, ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూస్తానని భరోసా కల్పించారు. పత్తి కొనడం లేదంటూ ఆందోళన చెందిన రైతులు వారి సమస్యను తన దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు.
ఇప్పటికే ఈ విషయం మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్‌కు చెప్పి వెంటనే పీక్ సమస్య పరిష్కారించాలని ఆదేశాలిచ్చామన్నారు. ఫోన్లో సీసీఐ కార్పొరేషన్ ఆఫీసర్లతో తాను, కలెక్టర్ కూడా మాట్లాడినట్లు పేర్కొన్నారు. 15 రోజుల్లో పూర్తిస్థాయిలో పత్తిని కొనుగోలు చేస్తామని వారు హామీ ఇచ్చారన్నాని తెలిపారు. పత్తి నాణ్యంగా ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. పత్తి కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి కృషి చేస్తుందని, బుధవారం ఒక్కరోజే 17.03 లక్షల మంది రైతుల అకౌంట్ల్లో రైతు భరోసా జమ చేసిందన్నారు. పత్తి పంటను పూర్తిగా సేకరించడానికి మరింత గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్టు వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.