
మంచిర్యాల: నరేంద్ర మోదీ ప్రభుత్వం సంపన్నులకు రుణాలు మాఫీ చేశారే తప్ప.. దేశంలోని రైతులకు రుణాలు మాఫీ చేయలేదని మండిపడ్డారు చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి. అదానీ, అంబానీ కనుసన్నల్లోనే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మే 11వ తేదీ శనివారం మందమర్రి మండలంలోని అందుగుల పేట, ఊరు మందమర్రి, మామిడి గూడెం,పెద్ద ధర్మారం గ్రామాల్లో ఎమ్మేల్యే వివేక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే.. ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయల వరకు వేతనాలు పెంచుతుందని చెప్పారు. ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ ల్లో ఐదు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లోపు అమలు చేసిందన్నారు.
రైతులకు రెండు లక్షల రుణ మాఫీ ఆగస్టు 15 న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఎన్నికల కోడ్ తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే వివేక్ ప్రజలను అభ్యర్థించారు.