కోల్‌బెల్ట్, వెలుగు : పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీం ఇండియాకు క్రీడాకారులను పంపాలనే లక్ష్యంతో ఏటా కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో కాకా వెంకటస్వామి స్మారక చెన్నూరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలను వివేక్, వంశీకృష్ణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా మొత్తం113 మ్యాచ్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఒక టోర్నమెంట్ నిర్వహించాలనే ఆలోచన ఉందన్నారు. క్రీడా రంగం అభివృద్ధికి వెంకటస్వామి ఎంతగానో కృషి చేశారని గుర్తుచేశారు. 2011లో దేశంలో క్రికెట్ వరల్డ్ కప్ నిర్వహించడంలో ఆయన పాత్ర కూడా ఉందన్నారు. కాగా, క్రికెట్ పోటీలను ప్రారంభించే ముందు క్రీడాకారులను వివేక్ పరిచయం చేసుకున్నారు. వివేక్, వంశీకృష్ణ కొద్దిసేపు బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు.
జైపూర్పై మందమర్రి గెలుపు
మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల పరిధిలో కాకా వెంకటస్వామి స్మారక నియోజకవర్గ క్రికెట్ పోటీల్లో మంగళవారం మందమర్రి, జైపూర్ మండల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మందమర్రి 42 పరుగులతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన మందమర్రి టీం 15 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. భార్గవ్ 48 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 91 రన్స్ సాధించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జైపూర్ 15 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. 91 పరుగులు చేసిన మందమర్రి జట్టు క్రీడాకారుడు భార్గవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
అలాగే బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ-2 గ్రౌండ్లో కన్నెపల్లి -తాండూర్, కాసీపేట-నెన్నెల మండలాల జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. కన్నెపల్లి జట్టు 16 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌట్ కాగా.. తాండూరు 13.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. నరేశ్ గబ్బార్ 30 బాల్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. కాసీపేట, నెన్నెల జట్లు మధ్య జరిగిన పోటీల్లో 10 పరుగుల తేడాతో కాసీపేట మండల జట్టు విజయం సాధించింది.
Also Read :జులైలో జింబాబ్వే టూర్‌కు టీమిండియా