అంబేద్కర్ ​స్ఫూర్తితో ముందుకు సాగుదాం : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

అంబేద్కర్ ​స్ఫూర్తితో ముందుకు సాగుదాం : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  •  రాజ్యాంగంతో దేశంలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతోంది
     

కోల్ బెల్ట్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దళితులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడుతోందని, ఆయన స్ఫూర్తిగా ముందుకు సాగుదామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి పిలుపునిచ్చారు. సోమవారం చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి, మందమర్రి, చెన్నూరు మున్సిపాలిటీలు, జైపూర్, భీమారం మండల కేంద్రాల్లో నిర్వహించిన అంబేద్కర్​జయంతి వేడుకల్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, దళిత సంఘాలతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంబేద్కర్​విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని అన్ని వర్గాలకు రాజ్యాంగంతో మేలు జరుగుతోందని, అలాంటి రాజ్యాంగాన్ని మార్చేందుకు కొన్ని దుష్టశక్తులు ఏకమవుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి కూడా రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలే కారణమన్నారు. జైపూర్​లో అంబేద్కర్ భవనం రూ.25లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

కార్మికులకు కనీస వేతనాలు, పనిదినాలు, సంఘాల ఏర్పాటు, కార్మికుల భద్రత వంటి చట్టాలను అంబేద్కర్ తీసుకొచ్చారని గుర్తుచేశారు. దళితులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 18 శాతం రిజర్వేషన్లు కల్పించే చేవేళ్ల డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రతి ఏటా ఏదో ఒక ప్రకటన చేయాలని కోరారు. నేతకాని, మాలల కార్పొరేషన్లు అమలును సీఎం వెంటనే ప్రకటించాలని డిమాండ్​ చేశారు.

బడ్జెట్​లో దళితులకు 18 శాతం ఫండ్స్ కేటాయించాలన్నారు. కాంగ్రెస్​ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరించారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత చెన్నూరులో ఇసుక, బియ్యం దందా అడ్డుకున్నానన్నారు. కానీ తనను బాద్నాం చేయాలనే బీఆర్​ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజల అభ్యన్నతికి కోసం అభివృద్ధి పనులు చేయడమే తన బాధ్యత అని పేర్కొన్నారు.