
- ఇష్టమున్నట్లు మాట్లాడితే ఊరుకోం: ఎమ్మెల్యే వివేక్
- ప్రజలు ఓడించినా బీఆర్ఎస్ లీడర్లకు బుద్ధిరాలే
- అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో అందరినీ తిట్టిన్రు
- ఇప్పుడూ అట్లనే మాట్లాడ్తమంటే ప్రజలు సహించరని హెచ్చరిక
మంచిర్యాల, వెలుగు: బాల్క సుమన్ వ్యాఖ్యలపై చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. ఫ్రస్టేషన్‌తోనే బీఆర్ఎస్ నేతలు నోరు పారేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలు ఓడించినా ఆ పార్టీ లీడర్లకు బుద్ధి రాలేదని, వాళ్లకు అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. ‘‘అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో రెచ్చిపోయిన్రు. వాళ్ల ఓవరాక్షన్ మాటలతోనే బీఆర్ఎస్ను ప్రజలు బొందపెట్టిన్రు. ఇంకా అట్లనే మాట్లాడుతామంటే ప్రజలు సహించరు” అని అన్నారు. ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
‘‘కేంద్ర మంత్రిని కేసీఆర్ రండ అని, ఇతర పార్టీల లీడర్లను దద్దమ్మలు అని ఇష్టమున్నట్లు తిట్టిండు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో అందరినీ తిట్టుకుంట వచ్చిన్రు. మీ అహంకారాన్ని సహించలేక ప్రజలు ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పిన్రు. అయినా మీకు బుద్ధిరాలేదు. ఇప్పటికైనా తప్పులను సరిదిద్దుకోండి. దిగజారి మాట్లాడితే ఊరుకునేది లేదు. ఒళ్లు దగ్గర పెట్టుకోండి” అని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
తగిన శాస్తి చేస్తం: ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు
సుమన్ వ్యాఖ్యలను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఖండించారు. ‘‘రేపటి నుంచి జిల్లాలో సుమన్ ఎట్ల తిరుగుతడో చూస్తం. సుమన్ రాసలీలలు అన్నీ బయటపెడ్తం. ఎక్కడినుంచో మంచిర్యాల జిల్లాకు వచ్చి పెత్తనం చెలాయిస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదు” అని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు సుమన్‌కు తగిన శాస్తి చేస్తారన్నారు.
బాల్క సుమన్‌పై మంచిర్యాల పీఎస్‌లో కేసు
బాల్క సుమన్ కామెంట్లపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాల్క సుమన్ పై క్రైం నంబర్ 91/24 కింద 294బీ, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.