
- ఏర్పాటు కోసం రాష్ట్ర సర్కార్, సింగరేణి ఆఫీసర్లతో మాట్లాడిన: వివేక్ వెంకటస్వామి
- కొత్త గనులు వస్తే.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వెల్లడి
- మందమర్రిలో రూ.20 లక్షలతో హెల్త్ సబ్ సెంటర్ పనులకు శంకుస్థాపన
కోల్ బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు: సింగరేణిలో కొత్త బొగ్గు గనుల ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డి, సింగరేణి ఆఫీసర్లతో చర్చించి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కొత్త బొగ్గు గనుల తవ్వకాలతో కోల్ బెల్ట్ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు సింగరేణి పురోభివృద్ధి చెందుతుందన్నారు. శనివారం సాయంత్రం మంచిర్యాల జిల్లా మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల్లో వివేక్ వెంకటస్వామి పర్యటించారు.
ఈ సందర్భంగా మందమర్రి పట్టణం పాలచెట్టు ఏరియాలోని నేతాజీ నగర్‌లో రూ.20 లక్షల (15వ ఆర్థిక సంఘం ఫండ్స్)తో నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసి, మాట్లాడారు. సింగరేణిలో గనులు మూత పడుతున్నాయని, కొత్త బొగ్గు గనుల ఏర్పాటు అవశ్యకతను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. శుక్రవారం సీఎం, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, ఆఫీసర్లతో కొత్త గనులు తీసుకురావడంపై మీటింగ్‌లో చర్చించామన్నారు.
త్వరలో అధికారికంగా మీటింగ్ నిర్వహించి కొత్త గనులు, ఉపాధి అవకాశాలు పెంచడంపై రివ్యూ చేస్తామని తెలిపారు. అప్పటి పెద్దపల్లి ఎంపీ కాకా వెంకటస్వామి, మాజీ మంత్రి వినోద్ కలిసి సింగరేణి ద్వారా జైపూర్‌లో 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేశారని గుర్తుచేశారు. ప్లాంట్ విస్తరణలో భాగంగా మరో 850 మెగావాట్ల మూడో పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు చెప్పారు. త్వరలో సీఎం చేతుల మీదుగా మూడో పవర్ ప్లాంట్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఆరు నెలల్లో ఇంటింటికి తాగు నీరు..
చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో ఇంటింటికి తాగునీరు అందించేందుకు రూ.100 కోట్ల నిధులతో అమృత్ స్కీం పనులు చేపట్టినట్లు వివేక్ వెంకటస్వామి తెలిపారు. రూ.30 కోట్లతో మందమర్రి మున్సిపాలిటీలో చేపట్టిన ఈ స్కీం ద్వారా మరో 6 నెలల్లో ఇంటింటికి తాగు నీరు అందిస్తామని చెప్పారు. మందమర్రి మున్సిపాలిటీలోని యాపల్ ప్రాంతంలో రూ.2 కోట్ల నిధులతో చేపట్టిన సైడ్ డ్రైనేజీల నిర్మాణం పనులు తుదిదశకు చేరుకున్నాయన్నారు. దీపక్ నగర్‌లో రూ.70 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డుతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
చెన్నూరు నియోజకవర్గంలో అవసరం ఉన్న చోట సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. మందమర్రిలో శ్మశానవాటిక కోసం రూ.20 లక్షలు కేటాయించి, త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. టీయూఎఫ్‌ఐడీసీ ఫండ్స్‌తో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై పలువురు ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందజేశారు. హెల్త్ సబ్ సెంటర్ భూమి పూజ కార్యక్రమంలో మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, ఎంపీడీవో రాజేశ్వర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గణపతి, డాక్టర్ రమేశ్, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ నోముల ఉపేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలో పూజలు..
మందమర్రి పాత బస్టాండ్ ఏరియా మారుతీనగర్‌లోని అభయాంజనేయ స్వామి ఆలయాన్ని వివేక్ దర్శించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ బండి సదానందం యాదవ్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. వచ్చే నెల శ్రీరామ నవమికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మున్సిపల్ ఆఫీసర్లను ఆదేశించారు. బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ఏరియాలో కాంగ్రెస్ నాయకురాలు సులోచన చిన్న కుమారుడు ప్రణిత్, గ్రీష్మ నూతన దంపతులను, కన్నాల గ్రామ పంచాయతీలోని లక్ష్మణ్- సింధూరి దంపతుల కుమార్తె బేబీ ధన్విక చెవులు కుట్టించే కార్యక్రమంలో వివేక్ పాల్గొన్నారు. మందమర్రి మున్సిపాలిటీలో మారుతి నగర్‌కు చెందిన ఎండీ హనీఫ్ అనారోగ్యంతో మృతి చెందగా, బాధిత కుటుంబానికి వివేక్ వెంకటస్వామి సీఎం రిలీప్ ఫండ్ చెక్కును అందజేశారు.