చెన్నూర్ లో  బస్ డిపో పనులపై ఆశలు

చెన్నూర్ లో  బస్ డిపో పనులపై ఆశలు
  • - డిపో ఏర్పాటైతే మూడు రాష్ట్రాలకు మెరుగుపడనున్న రవాణా సౌకర్యాలు 
  • ఫండ్స్ కేటాయించి త్వరగా పనులు పూర్తి చేయాలని అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి
  • రోడ్లు బాగుచేశాం.. బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్​
  • డిపో ఏర్పాటు చేస్తున్నామన్న రవాణా శాఖ మంత్రి పొన్నం

కోల్​బెల్ట్/చెన్నూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూర్​లో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు డిపో నిర్మాణపనుల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. డిపో ఏర్పాటుకు అవసరమైన ఫండ్స్​మంజూరు చేసి నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అసెంబ్లీలో ప్రస్తావించగా.. డిపో ఏర్పాటుకు సర్కార్​కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ప్రకటన స్థానికుల్లో ఆశలు రేపుతోంది. చెన్నూర్​లో డిపో అందుబాటులోకి వస్తే బస్సుల సంఖ్య పెరిగి తంతెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్​గఢ్ రాష్ట్రాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. 

హడావిడి నిర్ణయంతో ఆగిన పనులు

చెన్నూర్​లో ఆర్టీసీ డిపో కోసం స్థానికులు ఏండ్లుగా డిమాండ్​ చేస్తున్నారు. బీఆర్ఎస్ సర్కార్ హయంలో డిపో ఏర్పాటుకు సేకరించిన స్థలం వివాదంలో ఉండటంతో నిర్మాణ పనులు ఆగుతూ.. సాగుతూ 7 నెలల క్రితం పూర్తిగా నిలిచిపోయాయి. 2017లో గెర్రె కాలనీలోని సర్వే నంబర్​ 869లో 4.05 ఎకరాల స్థలాన్ని డిపో కోసం ప్రతిపాదించి 2019లో ఆర్టీసీకి అప్పగించారు. డిపో నిర్మాణానికి ప్రభుత్వం రూ.4 కోట్ల ఫండ్స్​ కేటాయించి 2023 జులై 7న టెండర్లు పిలిచింది. మొదటి విడతగా రూ.1.20 కోట్ల ఫండ్స్​సైతం రిలీజ్​చేసింది. అయితే డిపో కోసం కేటాయించిన స్థలం వివాదం పరిష్కరించకుండా అప్పటి బీఆర్ఎస్ పాలకులు ఎన్నికల ముందు హడావిడిగా డిపో పనులకు శంకుస్థాపన చేశారు. కాంపౌడ్ ​వాల్ తోపాటు బేస్​మెంట్, గ్యారేజీ పనులు కొనసాగుతుం డగా.. ఆ స్థలం తమదని  పనులు నిలివేయాలంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఏడాది మేలో ఆర్టీసీ ఆఫీసర్లు పనులు నిలిపివేశారు.

డిపో ఏర్పాటుపై అసెంబ్లీలో ప్రస్తావించిన వివేక్​ 

ఆగిపోయిన చెన్నూర్ ​డిపో పనులను పూర్తి చేసేందుకు ఫండ్స్ ​మంజూరు చేసి, త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి మంగళవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. చెన్నూరుకు మహారాష్ట్ర, చత్తీస్​గఢ్ ​బార్డర్లు ఉన్నా యని, అందుకే ఇక్కడ బస్సు డిపో ఎంతో ముఖ్యమన్నారు. చాలా చోట్ల రోడ్లు రిపేర్లు చేశామని, తొందరగా డిపో పనులు చేపట్టాలని కోరారు.

Also Read :- కొడంగల్ బడుల్లో బ్రేక్ ఫాస్ట్

ఇందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభా కర్​ సమాధానమిస్తూ.. డిపో స్థల వివాదం హైకోర్టులో ఉందని, సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలో డిపోను అందుబాటులోకి తీసుకవస్తామని హామీ ఇచ్చారు. 

మెరుగుపడనున్న రవాణా సౌకర్యాలు

చెన్నూర్ నియోజకవర్గ కేంద్రం నుంచి బస్సుల ద్వారా రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నూర్ బస్టాండ్​నుంచి కోటపల్లి, వేమనపల్లి, జైపూర్, భీమారం మండలాల పరిధిలోని గ్రామాలకు చేరుకోడానికి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డిపో నుంచి వచ్చే బస్సులపై ఆధారపడాల్సిందే. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మంచిర్యాల డిపో ఆఫీసర్లు బస్సులు నడపకపోవటంతో నిత్యం కిక్కిరిసి ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు.

జయశంకర్ ​భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి చెన్నూర్ మీదుగానే భక్తులు వెళ్తుంటారు. మహారాష్ట్రలోని సిరోంచ మీదుగా కాళేశ్వరానికి ఆర్టీసీ బస్సులు సైతం నడుస్తుండడంతో రద్దీ పెరిగింది. చెన్నూరులో బస్సు డిపో అందుబాటులోకి అన్ని ప్రాంతాల ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయి. ఇక్కడ డిపో ఏర్పాటైతే తెలుగువారు అధికంగా నివసించే మహారాష్ట్రంలోని సిరొంచ, అసరెల్లి,  ధర్మపురితోపాటు చత్తీస్​గఢ్​లోని పలు ప్రాంతాలకు బస్సులు నడిపించవచ్చు.