- చెన్నై, కర్నాటక తరహాలో యువతకు ఉపాధి కల్పిస్తం:
పంజాగుట్ట, వెలుగు: రాష్ట్రంలో లెదర్ పరిశ్రమకు పూర్వవైభవం తీసుకువస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నై, కర్నాటకలో నిర్వహిస్తున్న పరిశ్రమలను సందర్శించి అధ్యయనం చేస్తానన్నారు. తెలంగాణలో ఆయా పరిశ్రమలను అత్యాధునిక పద్ధతుల్లో తీర్చి దిద్దేందుకు తనవంతు కృషిచేస్తానని పేర్కొన్నారు.
మంగళవారం తెలంగాణ మాదిగ, చర్మకారుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ బృందం.. సంఘం కో- ఆర్డినేటర్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దేవని సతీశ్ మాదిగ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కలిసింది. తెలంగాణలో మాదిగ సామాజికవర్గమంతా చెప్పులు, బూట్లు కుడుతూ జీవిస్తున్నారని, లెదర్ ఇండస్ట్రీ మూత పడడంతో యువతకు ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. యంగ్ స్కిల్ డెవలప్మెంట్యూనివర్సిటీలో లెదర్ డెవలప్మెంట్ కోర్సు ప్రవేశ పెట్టి.. మాదిగలకే పూర్తిగా సీట్లు కేటాయించి.. వారిని లెదర్ డెవలప్మెంట్ఐటీలో ఇంజినీర్లుగా తీర్చిదిద్దాలని కోరారు.
ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పొల్యూషన్ పేరుతో లెదర్ పరిశ్రమను మూసి వేసిందన్నారు.1978లో కాకా వెంకటస్వామి మంత్రిగా ఉన్నప్పుడు లీడ్‌క్యాప్ కార్పొరేషన్‌ను బాగా నడిపించాలని ఎక్కువ నిధులు తీసుకువచ్చి సెంటర్లను ఏర్పాటు చేశారని తెలిపారు. 20 యేండ్ల క్రితం చెన్నూరు నియోజకవర్గంలో వినోద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లెదర్ పార్కు అభివృద్ధి జరిగిందన్నారు.
అసెంబ్లీలో తాను రెండు ప్రశ్నలు లేవనెత్తానని వివేక్ తెలిపారు. వాటిలో లెదర్ ఇండస్ట్రీని మళ్లీ రివైజ్ చేయాలని, నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పించాలని కోరాన్నారు. వివేక్ వెంకటస్వామిని కలిసిన వారిలో సంఘం కన్వీనర్ కుసపాటి శ్రీనివాస్, తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటేపల్లి రాములు, మాధవ రెడ్డి, బొల్లి కిషన్, మామిడి గోపి, వెంకట్ తదితరులు ఉన్నారు.