బాల్క సుమన్ ఇచ్చిన తప్పుడు కంప్లయింట్ తో
48 గంటల్లో నా ఇండ్లు,సంస్థల మీదికెట్ల వచ్చిండ్రు
ఐటీ శాఖ బెస్ట్ అవార్డు ఇచ్చిన నాపైనే రెయిడ్సా
ఈడీ, ఐటీ దాడులు కేసీఆర్, కవితపై చేయాలి
అమిత్ షా.. దమ్ముంటే ఎంక్వైరీ చేయండి
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల: సీఎం కేసీఆర్ అవినీతిపై తానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పది సార్లు ఫిర్యాదు చేశానని, ఇప్పటి వరకూ పట్టించుకోలేదని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాళ ఆయన ఆయన చెన్నూరు నియోజకవర్గం కొల్లూరులో మీడియాతో మాట్లాడారు. తన ప్రత్యర్థి బాల్క సుమన్ ఇచ్చిన తప్పుడు కంప్లయింట్ పట్టుకొని 48 గంటల్లో తన ఇండ్లు, వ్యాపార సంస్థలపై దాడులకు ఎలా వచ్చారని వివేక్ ప్రశ్నించారు.
ఐటీశాఖ బెస్ట్ అవార్డు ఇచ్చిన తన సంస్థలకు దాడులు ఎలా చేయించారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు. కేసీఆర్ అవినీతిపై పదే పదే చెప్తున్న అమిత్ షా.. దమ్ముంటే ఇలాగే విచారణ చేయించాలని సవాలు విసిరారు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ పై, లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కవితపై ఈడీ, ఐటీ దాడులు చేయించాలన్నారు.
బాల్క సుమన్ ఇసుక దందాతో సూట్ కేసులు నింపుకున్నారని ఆరోపించారు. 60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పుల మయంగా మార్చారని మండిపడ్డారు. చెన్నూరు సెగ్మెంట్ లో ఏ ఒక్క గ్రామానికి నీళ్లు సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ పై చర్యలుంటాయని చెప్పారు. కాంగ్రెస్ 75–80 స్థానాల్లో విజయం సాధించబోతోందని వివేక్ ధీమా వ్యక్తం చేశారు.