కేంద్రంలో మోదీకి..తెలంగాణలో కేసీఆర్కు.. ఈ ఎన్నికలు గుణపాఠం: ఎమ్మెల్యే వివేక్

కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.   దర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. ఎన్నికల్లో  అహంకార నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కు, ఏపీలో జగన్ కు, కేంద్రంలో మోదీకి ఈ ఎన్నికలు  గుణపాఠం అన్నారు. కేంద్రంలో మోడీకి ఆధరణ తగ్గింది.. కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ వచ్చిందన్నారు. 

ఎన్డీయే  ప్రభుత్వం ఈడీ, సీబీఐతో బెదిరిస్తూ గెలవాల‌ని చూసింది.. కానీ ప్రజలంతా గమనించారని అన్నారు. పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ భారీ మెజారిటీతో గెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు వివేక్ వెంకటస్వామి.

ప్రజల ఆధరణతో అత్యధిక మెజారిటీతో ఎంపిగా గెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు వంశీకృష్ణ. తిరుమల శ్రీవారి ఆశీస్సులు  తీసుకున్నామని చెప్పారు. తాతయ్య కాకా వెంకట స్వామి అడుగుజాడల్లో నడుస్తూ..  ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. 

పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీచేసిన గడ్డం వంశీకృష్ణ ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పై లక్షా 30 వేల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మూడో స్థానానికే పరిమితమయిన సంగతి తెలిసిందే..