వేలాల మల్లన్న ఆలయ..అభివృద్ధికి కృషిచేస్త : వివేక్​ వెంకటస్వామి

  • చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి హామీ
  • --కుటుంబ సమేతంగా గట్టు మల్లన్న, కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి పూజలు

జైపూర్/చెన్నూరు/మహదేవపూర్, వెలుగు :  మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం వేలాల గట్టు మల్లన్నస్వామి జాతరను అభివృద్ధి చేసి, పర్యా టక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ అన్నారు. శివరాత్రి సందర్భంగా తన సతీమణి సరోజ, కొడుకు, కాంగ్రెస్​ యువ నేత వంశీకృష్ణతో కలిసి శుక్రవారం మంచిర్యాల జిల్లా జైపూర్ ​ మండలంలోని వేలాల గట్టు మల్లన్నస్వామి ఆలయం, చెన్నూరు మండలం కత్తెరశాలలోని మల్లికార్జున స్వామి ఆలయం, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తీశ్వర ఆలయాలను వివేక్  సందర్శించారు. 

స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన​మాట్లాడుతూ వేలాలలోని గట్టు మల్లన్న ఈ ప్రాంత ప్రజల ఆరాధ్యదైవమని, మహాశివరాత్రి జాతరకు ఏటా 3 నుంచి  4 లక్షల మంది  భక్తులు వస్తారన్నారు. జాతరకు వచ్చే భక్తులకు  విశాక ట్రస్ట్​ ద్వారా వివిధ రకాల సేవలు అందిస్తున్నామని, తాగునీటి కోసం బోర్లు వేశామన్నారు. ఆలయం వరకు రోడ్డు వేయాల్సి ఉన్నా  ఫారెస్ట్  పరిధిలో ఉండడంతో  పర్మిషన్  రావడం లేదన్నారు. 

ఈ విషయాన్ని రాష్ట్ర సర్కారు దృష్టికి తీసుకెళ్లి రోడ్డు నిర్మాణానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా మల్లన్న సన్నిధిలో నిలువెత్తు బంగారం మొక్కు చెల్లించారు. అనంతరం వేలాలలోని మల్లికార్జునస్వామి ఆలయం, జైపూ ర్​ మండలం పెగడపల్లిలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. చెన్నూరు మండలం కత్తెరశాలలోని మల్లికార్జునస్వామి ఆలయంలో జరిగిన స్వామివారి కల్యాణ వేడుకల్లోనూ ఆయన కుటుంబసమేతంగా పాల్గొన్నారు. తర్వాత జయశంకర్  భూపాలపల్లి జిల్లా మహదేవపూర్  మండలంలోని కాళేశ్వరం ఆలయానికి చేరుకొన్న వివేక్  దంపతులకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కాళేశ్వర ముక్తీశ్వ ర స్వామివారికి వారు ప్రత్యేక పూజలు చేశారు.