మంచిర్యాల: లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ప్రజలను కోరారు. మందమర్రి మార్కెట్లోని మసీదులో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి అఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ అధిష్టానం తన కుమారుడు వంశీకృష్ణకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించిందన్నారు.
వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. మాట ఇచ్చి ప్రకారం ఇప్పటికే 5గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్నారు. వచ్చిన మూడు నెల్లలోనే ప్రభుత్వ పథకాలను అమలు చేయడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.
గత ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసింది తప్పా.. ప్రజలకు ఉపయోగపడే పనేలేవి చేయలేదన్నారు. కాంట్రాక్టర్లకు ఇష్టారీతిన కాంట్రాక్టులు కట్టబెట్టి నిధులు రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని అన్నారు. పదేళ్ళలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు. సంక్షేమపథకాల అమలులో కేసీఆర్ మాట తప్పారని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. అహంకారంతో ప్రవర్తించిన కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు.
ప్రజాపాలనే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలు..లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 17 లోక్ సభ స్థానాల్లో 14 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందన్నారు వివేక్.
పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాకా కుటుంబానికి 70 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. నాకు టికెట్ రావడంలో ఇక్కడి ప్రజల ఆశీర్వాదం ఉందన్నారు.