మాలలను చిన్నచూపు చూస్తున్నరు..ఐక్యంగా ఉండి జాతిని కాపాడుకుందాం: వివేక్ వెంకటస్వామి 

  • ఏపీలోని కందుకూరులో మాలల మహాగర్జన 

హైదరాబాద్, వెలుగు : ఐక్యంగా ఉండి మాల జాతిని కాపాడుకుందామని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఐక్యంగా లేకపోవటం వల్ల అన్ని రాజకీయ పార్టీలు మాలలను చిన్నచూపు చూస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఏపీలోని ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగిన మాలల మహాగర్జన బహిరంగ సభకు వివేక్ వెంకటస్వామి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు హాజరయ్యారు. దీనికి తెలంగాణ, ఏపీ నుంచి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. జై భీమ్, జై మాల నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.

అంతకుముందు కందుకూరులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వివేక్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఇతర కులాల కంటే మాలల జనాభా అధికంగా ఉందని చెప్పారు. తెలంగాణలో జనాభా పరంగా మాలలు రెండో ప్లేస్ లో ఉన్నారని తెలిపారు. ‘‘మాలల సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ అందరూ కలిసి ముందుకు రావటం లేదు. మన సత్తా చూపించుకోవాలి. అందరూ ముందుకు రావాలి. మేం అండగా ఉంటాం. మనకెందుకులే, వేరే వాళ్లు లీడ్ తీసుకుని పోరాడుతారులే అన్న అభిప్రాయం మాలల్లో ఉంది. ఇది కరెక్ట్ కాదు” అని అన్నారు.