- ఎస్సీ వర్గీకరణపై జ్యుడీషియల్ కమిటీ వేయాలి
బషీర్ బాగ్, వెలుగు: మాలలను అన్ని రాజకీయ పార్టీలు తక్కువగా అంచనా వేయడం సరికాదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో జ్యుడీషియల్కమిటీని వేస్తేనే అన్నివర్గాలకూ న్యాయం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల ఆధ్వర్యంలో మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా వివేక్ హాజరై మాట్లాడారు. మాల సంఘాలు ఐక్యంగా ఉండాలని, ఏకతాటిపైకి వస్తేనే హక్కులను సాధించుకోవచ్చని చెప్పారు.
మన హక్కుల కోసం గళం ఎత్తాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ బోధించినట్లు ‘సమీకరించు, బోధించు , పోరాడు’ సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ.. నవంబర్ 10న హైదరాబాద్ నగరంలో 10 లక్షల మంది మాలలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, మాలల బలాన్ని చాటుతామని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ దూమర్ల నిరంజన్ , ప్రతినిధులు బాలరాజు , సర్వయ్య , డాక్టర్ అర్జున్ రాజు పాల్గొన్నారు.