- ఓటమిని జీర్ణించుకోలేక పిచ్చి కూతలు కూస్తున్నరు
- బీఆర్ఎస్ నేతల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నరు
- అదొక బానిస పార్టీ.. త్వరలోనే ఖాళీ అవుతుంది
- లోక్‌సభ ఎన్నికల్లో వాళ్లకు ఒక్క సీటు కూడా రాదని వెల్లడి
మంచిర్యాల, వెలుగు: బాల్క సుమన్ చెప్పు చూపించాల్సింది బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు అని.. సీఎం రేవంత్‌రెడ్డికి కాదని చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. సీఎంపై సుమన్ చేసిన కామెంట్లను ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మంచిర్యాలలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి భాషను మొదలు పెట్టిందే కేసీఆర్ అని విమర్శించారు. ఆయన సీఎంగా ఉన్నన్నప్పుడు కేంద్ర మంత్రులను, ప్రతిపక్ష నేతలను రండలు, దద్దమ్మలు అంటూ నానా బూతులు తిట్టారని గుర్తుచేశారు. సుమన్ చెప్పు చూపించడానికి సూత్రధారి కేసీఆర్ అని అన్నారు. ‘‘అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు అహంకారంతో వ్యవహరించారు. ఇప్పుడు ఓటమిని జీర్ణించుకోలేక పిచ్చికూతలు కూస్తున్నరు. గత పదేండ్లలో అధికార మదంతో అహంకారం నెత్తికెక్కి తప్పుడు కేసులతో ప్రజలను బెదిరించిన్రు. ఎన్నికల్లో ఓడిపోయినా వారి తీరు మారలేదు” అని విమర్శించారు. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, గద్దర్ వంటి వాళ్లను కేసీఆర్ అవమానించిన విషయం ప్రజలు మర్చిపోలేదన్నారు.
‘‘కేసీఆర్ బానిసత్వంలో బాల్క సుమన్ ఒక చిన్న వ్యక్తి. బీఆర్ఎస్ బానిస పార్టీ. అందులో ఉంటే తమ పరిస్థితి ఏమిటని లీడర్లు భయపడుతున్నరు. త్వరలోనే ఆ పార్టీ ఖాళీ అవుతుంది” అన్నారు. బీఆర్ఎస్ను ప్రజలు ఎందుకు తిరస్కరించారో ఆలోచించుకోవాలని, చేసిన తప్పులను ఇప్పటికైనా సరిదిద్దుకోవాలని హితవు చెప్పారు. లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని, ప్రజలు చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్తారన్నారని వార్నింగ్ ఇచ్చారు. ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ నాయకులు మూల రాజిరెడ్డి, చెరుకు సత్యనారాయణరెడ్డి, బండి సదానందం పాల్గొన్నారు.
ALSO READ: ప్రజావాణికి 2,192 అప్లికేషన్లు