- త్వరలో అన్ని సర్కార్ దవాఖానల్లో పోస్టులు భర్తీ చేస్తాం: వివేక్ వెంకటస్వామి
- జైపూర్ మండలంలో పీహెచ్‌సీని ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే
- బైక్‌పై తిరుగుతూ ప్రజల సమస్యలపై ఆరా
కోల్ బెల్ట్, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక 7 వేల మంది స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేశామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లల్లో పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి, జైపూర్, చెన్నూరు మండలాల్లో వివేక్ బైక్‌పై పర్యటించారు. జైపూర్ మండలం కుందారంలో రూ.1.56 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీఎంహెచ్‌వో హరీశ్ రాజ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ, ఇందారంలో ఆస్పత్రి కావాలని తాను ఎంపీగా ఉన్నప్పుడు గ్రామస్తులు కోరారని, తాను ఎమ్మెల్యేగా గెలవగానే హాస్పిటల్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ అవసరమైన స్టాఫ్‌ను నియమించాలని కలెక్టర్‌కు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. చికిత్స కోసం మంచిర్యాలకు వెళ్లకుండా చెన్నూరులోనే అన్ని రకాల వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పేదవారిని ఆదుకోవడానికి పథకాలు..
పేదవారిని ఆర్థికంగా ఆదుకోవడానికి కాంగ్రెస్ సర్కార్ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వివేక్ వెంకటస్వామి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు రూ.1.50 లక్షల వరకు రైతు రుణ మాఫీ చేశారని, సుమారు 60 శాతం మంది రైతులకు మాఫీ జరిగిందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. కొందరు తమకు రుణమాఫీ రాలేదని అంటున్నారని, అలాంటి వాళ్లు లిస్ట్ రాసి ఇస్తే లబ్ధిదారులకు తప్పకుండా మాఫీ చేపిస్తామని భరోసా ఇచ్చారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటివరకు ఐదింటిని పూర్తి చేశామని ఆయన తెలిపారు.
విద్య-, వైద్యం పేద ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యంపైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, అన్ని వర్గాల ప్రజలకు ఇప్పుడు స్వేచ్ఛ వచ్చిందని చెప్పారు. రైతు సంక్షేమ రాజ్యం తేవడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన చెన్నూరు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని, నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని చెప్పారు.
ఇసుక అక్రమ రవాణా చేస్తే సహించను..
చెన్నూరు నియోజకవర్గంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే సహించేది లేదని వివేక్ వెంకటస్వామి హెచ్చరించా రు. ఎవరైనా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను, పోలీసులను ఆదేశించా రు. ఇసుక క్వారీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. ఇటీవల అక్రమాలకు పాల్పడిన ఐదుగురు సిబ్బందిని తొలగించామని గుర్తుచేశారు. ఇసుక మాఫియాలో ఎంతటి వారున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక ఓవర్ లోడింగ్ వల్ల పాడైపోయిన రోడ్లతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చట్టం ప్రకారం వే బిల్లు చెల్లించి ఇసుకను తీసుకెళ్లాలని ఆయన సూచించారు.