కోల్‌బెల్ట్/జైపూర్, వెలుగు: చిన్న వయసులోనే ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టమని, ఎంపీగా ఆదరిస్తే కాకా వెంకటస్వామి స్ఫూర్తిగా అభివృద్ధికి కృషి చేస్తానని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. శనివారం చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి, జైపూర్ మండలాల్లోని అర్జునగుట్ట, మిట్టపెల్లి, ముదిగుంట గ్రామాల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ లీడర్లతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే, రాత్రి జైపూర్ మండలం కాన్కూర్, నర్వ గ్రామాల్లో జరిగిన బూత్ లెవల్ మీటింగ్‌కూ హాజరయ్యారు. మందమర్రిలో జరిగిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్‌లోనూ వంశీకృష్ణ పాల్గొన్నారు.
వంశీకృష్ణ మాట్లాడుతూ.. కాకా వెంకటస్వామి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తుపాకీ తూటాలకు ఎదురు నిలిచారన్నారు. ఆనాడు తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని నమ్మారని, తెలంగాణ చూసినంకనే కన్ను మూస్తానని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కూడా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో దోపిడీకి గురైందన్నారు. ప్రజలకు సేవ చేయాలనే గొప్ప మనసత్త్వం కలిగిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తన జీవితాన్ని వారికే అంకితం చేశారని, పదవిలో ఉన్న లేకున్నా పదేండ్లుగా సేవలు అందిస్తూ ప్రజల్లో ఉన్నారన్నారు. బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా గ్రామాలకు రాలేదని, ప్రజల సమస్యలు తీర్చలేదన్నారు. ఎంపీగా అవకాశం కల్పిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
యువతకు ఉపాధి చూపిస్తా..
డీగ్రీలు, పీజీలు చేసిన యువత ఆటోలు నడుపుకుంటున్నారని, తాను గెలిస్తే వారికి ఉపాధి చూపుతానని వంశీకృష్ణ తెలిపారు. ఇంటింటికో ఉద్యోగం, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు అంటూ పథకాల పేరుతో ప్రజల జీవితాలను కేసీఆర్ ఎగతాళి చేశారని మండిపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు సక్సెస్ అయితే.. తాగు నీటి కోసం బోర్లు వేయాలని గ్రామాల్లో ప్రజలు తమను ఎందుకు ఆడుగుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికీ గ్రామాల్లో కాంగ్రెస్ హయాంలో కట్టిన ఇందిరమ్మ ఇండ్లు, వేసిన రోడ్లే కనిపిస్తున్నాయని చెప్పారు. విశాక ట్రస్టు, కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా పెద్దపల్లి ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అర్జునగుట్ట గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా వాటర్ సప్లై తీరును ఓవర్‌హెడ్ ట్యాంక్ ఎక్కి వంశీకృష్ణ పరిశీలించారు.
వంశీ గెలిస్తే అభివృద్ధి: వివేక్ వెంకటస్వామి
పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణకు భారీ మెజారిటీ ఇచ్చినప్పుడే ఈ ప్రాంత అభివృద్ధికి అత్యధిక నిధులను తెప్పించేందుకు సాధ్యమవుతుందని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కోటపల్లి మండలం పారిపెల్లి, లింగన్నపేట, అర్జునగుట్ట, రాపన్‌పల్లి, వెల్మపల్లి, బబ్బెరచెలుక గ్రామాల్లో గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాకా వెంకటస్వామి బాటలోనే ఈ ప్రాంత ప్రజల సంక్షేమం, అభ్యున్నతి కోసం వంశీకృష్ణ పనిచేస్తారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చి కేవలం మూడు నెలలు అవుతుందని, సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కొంత ఓపిక పట్టాలని కోరారు.
ఎన్నికల కోడ్ తర్వాత ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పదేండ్లలో బీఆర్‌ఎస్ లీడర్లు కాళేశ్వరంలో రూ.లక్ష కోట్లు, మిషన్ భగీరథలో రూ.45 వేల కోట్లు అవినీతి చేశారని, ఫోన్ ట్యాపింగ్, ధరణి వంటి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో తమ మీడియా సంస్థలకు రావాల్సిన రూ.150 కోట్ల అడ్వర్టైజ్‌లు రాకుండా చేశారన్నారు. ప్రజల కష్టాసుఖాలు పట్టించుకోని కేసీఆర్.. తన సొంత కుటుంబ ప్రయోజనాల కోసం రూ.వేల కోట్ల ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు. ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్తర్వాత రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని తెలిపారు.
కాంగ్రెస్ పాలనతోనే ప్రజలకు మేలు..
కాంగ్రెస్ పాలనతోనే ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రజలపై మోదీ ధరల భారం మోపుతున్నారని వివేక్ విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు చట్ట ప్రకారం రావాల్సిన ఎంఎస్పీ ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు. కాగా, కోటపల్లి మండలం అన్నారంలో వివేక్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు రావడం లేదని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన.. మంచిర్యాల ఆర్టీసీ డీఎం రవీంద్రనాథ్, ఆర్‌ఎం సాలోమాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
గ్రామానికి బస్సును ఎందుకు నడపడం లేదని ప్రశ్నించారు. వెంటనే బస్సు నడిపించాలని కోరారు. అన్నారంలో మిరపతోటల్లో పనిచేసి వస్తున్న బజ్జెరచెలుక గ్రామ కూలీలతో వివేక్ కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ లీడర్లు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరగా వారికి వివేక్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంచిర్యాల హైటెక్ సిటీకి చెందిన అడ్వకెట్ రాజేశ్ గౌడ్ నూతన గృహాప్రవేశ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. వరోవైపు, కోటపల్లి మండలం పారుపెల్లి గ్రామంలోని కాలబైరవుడికి వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ వేర్వేరుగా పూజలు చేశారు.