
తాను హామీ ఇస్తే తప్పకుండా అమలు చేస్తానని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అర్హులందరికీ ఆరుగ్యారంటీలు తప్పకుండా ఇస్తామన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బెజ్ఞాల గ్రామంలో ప్రజాపాలన అభయ హస్తం గ్యారంటీల ధరఖాస్తులను స్వీకరించారు. అందరూ అభయహస్తంకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ వెంకట స్వామి..ప్రజల దగ్గరికి పాలన రావాలనే ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమం పెట్టామని చెప్పారు. రేవంత్ సీఎం అయ్యాక సెక్రటేరియట్ ని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారన్నారు.
తాను ఇచ్చిన మొదటి హామీ ప్రకారం సింగరేణిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా సీఎంతో మాట్లాడి కృషి చేశానన్నారు వివేక్ వెంకటస్వామి. నిధులు కావాలంటే తనను అడగాలని ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొస్తామన్నారు. రూ. 600 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో ముంపునకు గురికాకుండా ప్రభుత్వం కరకట్ట నిర్మాణం చేపడుతుందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్ భగీరథ ద్వారా ఎఖ్కడా నీళ్లు రావడం లేదని విమర్శించారు. చెన్నూరు నియోజకవర్గంలో మిషన్ భగీరథ లోపాలను త్వరగా సరిదిద్దాలన్నారు. జనవరి 10 న మిషన్ భగీరథ పై రివ్యూ మీటింగ్ ఉంటుందన్నారు. భూముల సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు వివేక్ వెంకటస్వామి.