కోల్బెల్ట్, వెలుగు: తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం రాత్రి మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియం, సూపర్బజార్లో అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలను దేవతలుగా పూజించే గొప్ప సంప్రదాయం మన సొంతమన్నారు.
దసరా సంబురాలను చెన్నూరు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు భక్తిశ్రద్ధతలతో సంతోషంగా జరుపుకోవాలన్నారు. అనంతరం దుర్గామాతకు ఎమ్మెల్యే పూజలు చేశారు. ఎమ్మెల్యే వెంట మందమర్రి సీఐ శశీధర్రెడ్డి, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, గుర్తింపు సంఘం, అన్ని రాజకీయ, కార్మిక సంఘాల లీడర్లు పాల్గొన్నారు. మందమర్రి, రామకృష్ణాపూర్ బతుకమ్మ వేడుకల్లో మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్ దంపపతులు పాల్గొని ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందజేశారు.