పెద్దపల్లి​ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తం : వివేక్ ​వెంకటస్వామి

పెద్దపల్లి​ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తం : వివేక్ ​వెంకటస్వామి
  • స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపిద్దాం
  • చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి
  • పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఘనస్వాగతం
  • పటాకులు పేల్చి సంబురాలు

కోల్​బెల్ట్/చెన్నూరు/బెల్లంపల్లి రూరల్, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్​స్థానంలో కాంగ్రెస్​ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి.. ప్రజల ఆకాంక్షల మేరకు పార్లమెంట్ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని అన్నారు. బుధవారం ఆయన చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కన్నెపల్లి మండలం జన్కాపూర్​లో  ఎంపీపీ మాధవరపు సృజన-నర్సింగరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో భీమిని, కన్నెపల్లి మండలాల ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే మాట్లాడారు. 

వంశీని ఎంపీగా భారీ మోజార్టీతో గెలిపించిన ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు. అందరం కష్టపడి స్థానిక ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్​ను గెలిపిద్దామని పిలుపునిచ్చారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఎంపీ వంశీకృష్ణ సహకారంతో కన్నెపల్లి మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను నేతలు ఘనంగా సన్మానించారు. లీడర్లు చిలుముల శంకర్, ఎంపీటీసీ బొమ్మెన హరీశ్ గౌడ్, మునిమంద రమేశ్​, భీమిని మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 

బాధిత కుటుంబాలకు పరామర్శ

మందమర్రికి చెందిన కాంగ్రెస్​ లీడర్​ పైడిమల్ల నర్సింగ్ తల్లి అనసూర్య అనారోగ్యంతో చనిపోగా బుధవారం ఆమె భౌతికకాయాన్ని ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, దుర్గం నరేశ్, ఐఎన్టీయూసీ నేత కాంపెల్లి సమ్మయ్య​సందర్శించి నివాళ్లర్పించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నెన్నెల మండలం మెట్​పల్లిలో చనిపోయిన వేల్పుల రాజేశ్ ​కుటుంబాన్ని ఎమ్మెల్యే వివేక్ ​పరామర్శించారు. 

బొగ్గు గనిపై సంబురాలు

మందమర్రి ఏరియా కేకే-5 బొగ్గు గనిపై ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు సంబురాలు చేసుకున్నారు. గనిపై ఐఎన్టీయూసీ లీడర్లు, కార్మికులు పటాకులు పేల్చారు. ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ లీడర్లు నరేందర్, సూర్యనారాయణ, అలుగుల రవి తదితరులు పాల్గొన్నారు. 

నేతలకు ఘనస్వాగతం

పెద్దపల్లి ఎంపీగా గెలిచిన గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామితో కలిసి  చెన్నూరు నియోజకవర్గ కేంద్రానికి రావడంతో కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. క్యాంపు ఆఫీస్​వద్ద పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం లీడర్లు, కార్యకర్తలు వంశీకృష్ణ, వివేక్​వెంకటస్వామిని ఘనంగా సన్మానించారు. జైపూర్, భీమారం మండల కేంద్రాల్లో కూడా వీరికి ఘన స్వాగతం లభించింది. 

భీమారం మండలం వెలిశాల మల్లన్న ఆలయంలో వంశీకృష్ణ పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ ​చైర్మన్​ మూల రాజిరెడ్డి, పీఏ​సీఎస్​ చైర్మన్ ​చల్లా రాంరెడ్డి, చెన్నూరు టౌన్​ కాంగ్రెస్​ ప్రెసిడెంట్ ​సూర్యనారాయణ, లీడర్లు హేమవంత్​రెడ్డి, బాపురెడ్డి, సుధాకర్​రెడ్డి,  రాజమల్లాగౌడ్ ఘన్​శ్యాం, రాజమల్ల గౌడ్​, సుశీల్​ కుమార్, చింతల శ్రీనివాస్, చెన్న వెంకటేశ్వర్లు, మధు, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.