- మాలలను ఏకం చేసేందుకే జాగో మాల: వివేక్ వెంకటస్వామి
- తెలంగాణలో రెండో అతిపెద్ద కులమైనా.. గుర్తింపు లేదని ఆవేదన
- అన్ని పార్టీల్లో మాలలున్నా సరైన ప్రాధాన్యత లేదని వ్యాఖ్య
- మాలల సింహగర్జన కరపత్రాల ఆవిష్కరణలో చెన్నూరు ఎమ్మెల్యే
హైదరాబాద్‌సిటీ ,వెలుగు: రాష్ట్రంలో మాలలు తమ ఐక్యతను చాటుకుంటేనే వారి హక్కులను, గౌరవాన్ని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలంగాణలో రెండో అతిపెద్ద కులమైనా మాలలకు సరైన గౌరవం, గుర్తింపు లభించడం లేదన్నారు. మాలల్లో ఐక్యతను సాధించి హక్కులను సాధించుకునేందుకే జాగో మాల నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. మాల సంఘాల ఆధ్వర్యంలో డిసెంబరు 1న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ‘మాలల సింహగర్జన’బహిరంగ సభకు సంబంధించి కరపత్రాన్ని గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో వివేక్ ఆవిష్కరించి మాట్లాడారు.
మాలల్లో అందరితో కలిసిపోయే తత్వం, స్టెబిలిటీ ఉంటుందన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నా సరైన గుర్తింపు, గౌరవం మాత్రం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాలలు తక్కువ సంఖ్యలో ఉన్నారన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని, అందరం సంఘటితంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. అన్ని పార్టీల్లో మాలలు ఉన్నారు.. కానీ సరైన గుర్తింపు రావడం లేదన్నారు. మనల్ని కించపరుస్తున్నారన్న భావన కూడా మాలల్లో ఉందని పేర్కొన్నారు. మాలలపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే అందరూ ఏకతాటిపై నిలిచి ఐక్యతను చాటుకోవాలని పిలుపునిచ్చారు.
ఇటీవల నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన సభకు దాదాపు 50 వేల మంది హాజరై అందర్నీ ఆశ్చర్యపర్చారని వివేక్ పేర్కొన్నారు. మాల సంఘాల సమావేశాలకు పెద్ద సంఖ్యలో హాజరయ్యేందుకు మాలలు ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు. పరేడ్ గ్రౌండ్‌లో జరిగే మాలల సింహగర్జనను విజయవంతం చేసి అందరికీ స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
మాలలపై మానసిక దాడులు: ఎమ్మెల్యే నాగరాజు
30 ఏండ్లుగా మాలలపై మానసిక దాడులు జరుగుతున్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. రిజర్వేషన్లను మాలలు దోచుకుంటున్నారన్న అసత్య ప్రచారం జరుగుతోందని చెప్పారు. డిసెంబరు 1న జరిగే మాలల సింహ గర్జననను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మాల సంఘాల జేఏసీ చైర్మన్ జి.చెన్నయ్య మాట్లాడుతూ, మాలలను చైతన్యం చేసేందుకు మాలల సింహగర్జన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మీకు అన్ని విషయాల్లో తాము అండగా ఉంటామని వివేక్ వెంకటస్వామి ముందుకు రావడం గొప్ప విషయమని కొనియాడారు.
డిసెంబర్ సభకు లక్షల మంది మాలలు హాజరై, కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజు వస్తాద్ మాట్లాడుతూ, మాలలు ఐక్యంగా ఉంటేనే హక్కులను కాపాడుకోగలమన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కోఆర్డినేటర్ సర్వయ్య, మాల సంఘాల నాయకులు కొరివి వీరన్న, మేక వెంకన్న, బైరి రమేశ్, చెరకు రాంచందర్, ఉద్యోగ సంఘాల నాయకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి: వివేక్ వెంకటస్వామి
కోల్ బెల్ట్, వెలుగు: కాంగ్రెస్ సర్కార్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గురువారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం వివేక్ మాట్లాడారు. మందమర్రి మండలంలోని గ్రామాల్లో రూ.1.19 కోట్లతో డ్రైనేజీలు, సీసీ రోడ్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు.
మరోవైపు, పదేండ్లలో కాలంలో గత బీఆర్‌ఎస్ సర్కార్ క్యాతనపల్లిలోని రైల్వే ఆర్వోబీని పూర్తి చేయలేకపోయిందని వివేక్ మండిపడ్డారు. ఆర్వోబీ బ్రిడ్జి వద్ద మెట్ల దారి నిర్మాణానికి శంకుస్థాపన చేసి, మాట్లాడారు. ఆర్వోబీ బ్రిడ్జి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తాను పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు క్యాతనపల్లి, రామగుండం వద్ద రెండు రైల్వే ఆర్వోబీలను మంజూరు చేశానని చెప్పారు.
రామగుండం లో రూ.17 కోట్లను మంజూరు చేసి రూ.28 కోట్లతో ఆర్వోబీ పూర్తి చేయించినట్లు చెప్పారు. మరోవైపు, మందమర్రి మండలం సారంగపల్లి గ్రామంలో వడ్ల కేంద్రాన్ని వివేక్ ప్రారంభించారు. మందమర్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాండ్ల సంజీవ్, ప్రధాన కార్యదర్శి కడారి శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు వివేక్‌వెంకటస్వామిని కలిసి తమకు ఇండ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.