కాళేశ్వరం పెద్ద కుంభకోణమని ముందే చెప్పానన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గోదావరి ఖనిలో పెద్దపల్లి ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి.. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని రెండూ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. అవినీతిపై ప్రశ్నిస్తే తనపై ఈడీ దాడులు చేశారని ధ్వజమెత్తారు.
అమలయ్యే హామీలనే కాంగ్రెస్ ఇచ్చిందన్నారు వివేక్ వెంకటస్వామి. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో నిధులు తెచ్చానని చెప్పారు. నియోజకవర్గంలో 27 వేల ఇండ్లకు పట్టాలు అందజేశామన్నారు. రామగుండం ఫర్టిలైజర్ కోసం ఎంతో కష్టపడ్డామని.. ఓ విజన్ తో సీఎం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశారన్నారు. ఇటీవల దావోస్ వెళ్లిన శ్రీధర్ బాబు భారీ పెట్టుబడులు తెచ్చారని తెలిపారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. వంశీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తారని చెప్పారు.
కాక స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చామన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. పేద ప్రజల కోసం కాకా ఆనాడు ఎంతో కష్టపడ్డారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం వివేక్ అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. జైపూర్ పవర్ ప్లాంట్ ను కాంగ్రెస్ తెస్తే.. కేసీఆర్ తన ఖాతాలో వేసుకున్నారని విమర్శించారు. యువ నేత వంశీకి కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని చెప్పారు. వంశీని ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ నేతలకు సిగ్గు శరం ఉందా ? అని ప్రశ్నించారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు. కొప్పుల ఈ్వర్ ఖబడ్దార్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కొప్పుల ఈశ్వర్ దొంగదీక్షలన్నీ ప్రజలందరికీ తెలుసన్నారు. రామగుండల నియోజకవర్గానికి నీళ్లిచ్చారా? అని ప్రశ్నించారు. ఏ మొహం పెట్టుకుని పంట పొలాల దగ్గరకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చుతారా అంటూ ప్రశ్నించారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ పొలాల బాట పట్టారని తెలిపారు. . రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ లో ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు . వంశీ రెండు లక్షల మెజారిటీతో గెలుస్థారని చెప్పారు.