మోడీ ధనవంతులను సంపన్నులను చేస్తుండు
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కోల్బెల్ట్: బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్తన అనుచరులకు కాంట్రాక్టులు ఇస్తూ కమీషన్లు తీసుకున్నాడని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాళ మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగుల పేట, ఊరు మందమర్రి, కాసిపేట మండలం మామిడిగూడ గ్రామాల్లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరపున ప్రచారం నిర్వహించి ఈజీఎస్ కూలీలతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ కూడా మిషన్ భగీరథ వల్ల చుక్క రాలేదన్నారు. కాళేశ్వరంలో లక్ష కోట్లు, మిషన్ భగీరథలో రూ.60 వేల కోట్లు కేసీఆర్ మింగాడని ఆరోపించారు. ఆంధ్ర కాంట్రాక్టర్ మేఘ కృష్ణారెడ్డి కే అన్ని కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్లు తీసుకున్నాడని ఫైర్ అయ్యారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగు ల కు భృతి ఇవ్వకుండా మోసం చేశాడని విమర్వించారు.కోడ్ ముగిసిన తరువాత పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు మంజూరు చేస్తామన్నారు.
మహిళల కు రూ.2500 అకౌంట్ లో జమ చేస్తామన్నారు. మోదీ పాలనలో ధరలు పెరిగాయన్నారు. మోదీ ధనవంతులను సంపన్నులను చేస్తున్నాడన్నారు. సీఎం రేవంతవరెడ్డి ఆగస్ట్ 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తారని ఆయన చెప్పారు. రాహుల్ పీఎం అయితే ఉపాధి హామీ కూలీలకు రూ.400 ఇస్తామన్నారు. వంశీని పెద్దపల్లి ఎంపీ గా గెలిపిస్తే అందరం కలిసి ఎక్కువ నిధులతో అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అందుగులపేట వాగు పై రూ.3 కోట్లతో బ్రిడ్జి ఏర్పాటు చేస్తానని చెప్పారు. వంశీ ఎంపీగా గెలిస్తే యువతకు ఉద్యోగాలు ఇస్తాడన్నారు.