గండిపేట, వెలుగు: యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి తమ జీవితాలను కాపాడుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్‌లోని మణికొండ మున్సిపాలిటీ లాంకో హిల్స్‌లోని డాక్టర్ ప్రభు లైఫ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఆవరణలో శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉచితంగా డయాబెటిక్ టెస్ట్, లివర్-ఫైబ్రో స్కాన్ పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమానికి వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత బంగారు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ రెడ్డి అనేక కార్యక్రమాలను చేస్తున్నారని తెలిపారు. ‘సే నో టు డ్రగ్స్’అనే నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు. డ్రగ్స్ వల్ల పంజాబ్ నాశనం అయిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలన్నారు. డ్రగ్స్‌పై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు రాష్ట్ర సర్కార్ మరిన్ని కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు.
డ్రగ్స్ వల్ల అనేక మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు. చాప కింద నీరులా ఉన్న డయాబెటిస్‌కు హైదరాబాద్ హబ్‌గా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రభు లైఫ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ ప్రభుకుమార్, తెలంగాణ రాష్ట్ర మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పి.కాళీప్రసాద్‌రావు, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్‌రావు, డాక్టర్ ఈ.రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.