- మాలల సింహగర్జన సక్సెస్ అయింది: వివేక్ వెంకటస్వామి
- ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మాలలు ఐక్యంగా ముందుకొచ్చారని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌కు వ్యతిరేకంగా మాట్లాడే వారికి మాలల సింహగర్జన సభతో స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మాలల హక్కుల సాధన కోసం ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సింహగర్జన సభ గ్రాండ్ సక్సెస్ అయిందని తెలిపారు. మాలల సింహగర్జన చరిత్రాత్మకమైన సభ అని పేర్కొన్నారు.
ఈ సభకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మాలలు, దళిత మేధావులు పెద్ద సంఖ్యలో హాజరై, మాలల సత్తా చాటారన్నారు. ఇంత తక్కువ టైమ్‌లో సభకు భారీగా జనం తరలిరావడం పట్ల చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యాయని చెప్పారు. మాలల సింహగర్జన సక్సెస్ అయిన సందర్భంగా సోమవారం సోమాజిగూడలోని తన నివాసంలో మాల సంఘాల నేతలతో వివేక్ వెంకటస్వామి సక్సెస్ మీట్ నిర్వహించారు. మాల మహనాడు సంఘం అధ్యక్షుడు చెన్నయ్య, తెలంగాణ మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బేరా బాలకిషన్ ఆధ్వర్యంలో పలువురు నేతలు వివేక్‌ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మీటింగ్‌ను సక్సెస్ చేసిన మాల నేతలకు, కులస్తులకు వివేక్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వివేక్ మాట్లాడుతూ.. మాలల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, హక్కుల పోరాటానికి అందరు కలిసి రావాలని కోరారు. రాబోయే రోజుల్లో మాలల సంఖ్య తక్కువ అని అనే వారికి, చిన్న చూపు చూసే వారికి గట్టి బుద్ధి చెప్పేలా మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. సింహగర్జనకు వచ్చినట్లుగానే ఇదే ఐక్యత రానున్న రోజుల్లో కూడా చూపించాలని ఆయన కోరారు. మాలలను చిన్న చూపు చూస్తే తమకు ఇబ్బందని, వారిని గౌరవించాలని సింహగర్జన సభతో రాజకీయ పార్టీలకు అర్థమైందన్నారు.
ఈ ఐక్యత ఇలాగే కొనసాగాలి: చెన్నయ్య
సింహగర్జనకు 33 జిల్లాల నుంచి వచ్చిన మాల మహానాడు నేతలకు, కార్యకర్తలకు మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోనే కాకుండా సిటీ శివారు ప్రాంతాల్లో కూడా సింహగర్జన సందడి నెలకొందన్నారు. ఇదే ఐక్యతను రానున్న రోజుల్లో కూడా కొనసాగించాలని కోరారు. వివేక్ పై, ఆయన కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. బేరా బాలకిషన్ మాట్లాడుతూ.. గత 30 ఏండ్లుగా మనువాదుల కాళ్లు మొక్కుతూ దళిత జాతిని నిర్వీర్యం చేస్తూ రిజర్వేషన్లను శాశ్వతంగా ఎత్తివేసే కుట్రలు చేస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు ఏజెంట్‌గా మందకృష్ణ మాదిగ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మందకృష్ణ మాదిగ నిజ స్వరూపాన్ని సింహగర్జన సభ ద్వారా ప్రజలు గ్రహించారన్నారు.