క్యాతనపల్లిని క్లీన్​టౌన్​గా మారుస్త: ఎమ్మెల్యే వివేక్

క్యాతనపల్లిని క్లీన్​టౌన్​గా మారుస్త: ఎమ్మెల్యే వివేక్
  • రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్త: వివేక్ వెంకటస్వామి 
     
  • మున్సిపాలిటీలో రూ.25 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన 
  • టీయూఎఫ్​ఐడీసీ ఫండ్స్​కోసం కృషి చేస్తానని వెల్లడి

కోల్​బెల్ట్, వెలుగు: క్యాతనపల్లి మున్సిపాలిటీని క్లీన్​టౌన్​గా మారుస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో రూ.25లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. రాజీవ్​చౌక్​ వద్ద బస్​షెల్టర్, వాకింగ్​ట్రాక్, సైడ్ డ్రైయిన్స్, చిల్ర్డన్స్ ప్లే ఎక్విప్​మెంట్, వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడారు. క్యాతనపల్లిలోని అన్ని వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు ఫండ్స్​కేటాయించి పనులు చేపట్టామని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ‘‘క్యాతనపల్లి మున్సిపాలిటీ మూడో వార్డులో ఓపెన్​జిమ్ పక్కన చిల్డ్రన్స్​ప్లే ఎక్విప్​మెంట్, వాకింగ్​ట్రాక్​పనులకు స్థల పరిష్మన్​లేదంటూ సింగరేణి యాజమాన్యం అడ్డుకుంది.  ప్రజలకు ఉపయోగపడే పనులను ఆపవద్దు. వెంటనే సంస్థ పర్మిషన్​తీసుకోవాలని మందమర్రి ఏరియా జీఎం దేవేందర్​ను ఆదేశించాను” అని తెలిపారు. ‘‘టీయూఎఫ్​ఐడీసీ ఫండ్స్ లేకపోయినా ఎన్నికలకు ముందు బీఆర్ఎస్​ఈ నిధులతో పనులను ప్రకటించి ప్రజలను తప్పుదోవ పట్టించింది. చెన్నూరు నియోజకవర్గానికి టీయూఎఫ్​ఐడీసీ కింద అదనంగా ఫండ్స్ మంజూరు చేయాలని రివైజ్డ్​ప్రతిపాదనలు పంపించాం. ఫండ్స్​మంజూరు చేయాలని మున్సిపల్​సెక్రటరీ దానకిశోర్​ను కలిసి కోరాను” అని చెప్పారు. మిషన్​భగీరథ నీళ్లు రావడం లేదని స్థానికులు తన దృష్టికి తీసుకురావడంతో క్యాతనపల్లి మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ఇంటింటికీ డ్రింకింగ్​వాటర్​సప్లై కోసం రూ.40 కోట్లతో అమృత్​స్కీమ్ పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. కాగా, ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సింగరేణి జాగాల్లో నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని, సింగరేణి కాలనీల్లో స్ర్టీట్​లైట్లు, కరెంట్ సమస్యలు తీర్చాలని  కోరారు.  

ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్.. 

ఎమ్మెల్యే వివేక్ సమక్షంలో క్యాతనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్​కార్యకర్త ఏల్పుల సత్యనారాయణ బర్త్​డే వేడుకలు జరుపుకున్నారు. సత్యనారాయణ దంపతులను ఎమ్మెల్యే ఆశీర్వదించారు. బిజోన్​వ్యాపార సంఘం, ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో వేర్వేరుగా ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. రామకృష్ణాపూర్​లోని మదీనా (తవక్కల్) మసీద్​శిథిలావస్థకు చేరిందని, దాని నిర్మాణానికి సింగరేణి పర్మిషన్​ ఇవ్వట్లేదని ముస్లిం మైనార్టీ లీడర్లు చెప్పగా, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వివేక్ హామీ ఇచ్చారు. మంచిర్యాలలోని తన నివాసంలో మందమర్రి తహసీల్దార్​సతీశ్​కుమార్, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం దేవేందర్, మున్సిపల్, సింగరేణి ఎస్టేట్​ఆఫీసర్లతో వివేక్ రివ్యూ ​నిర్వహించారు. కార్యక్రమాల్లో క్యాతనపల్లి మున్సిపల్​చైర్​పర్సన్ జంగం కళ, వైస్​చైర్మన్ ​సాగర్​రెడ్డి, కమిషనర్​గద్దె రాజు, ఏఈ అచ్యుత్, కాంగ్రెస్​టౌన్​ప్రెసిడెంట్ పల్లె రాజు, కాంగ్రెస్​లీడర్లు గోపతి రాజయ్య, మహంకాళి శ్రీనివాస్, ఎంఏ అబ్దుల్​అజీజ్, నీలం శ్రీనివాస్​గౌడ్, ఓడ్నాల శ్రీనివాస్, గోపతి బానేశ్, గోపు రాజం, పుల్లూరి కల్యాణ్, మున్సిపల్ కౌన్సిలర్లు, లీడర్లు పాల్గొన్నారు.