‘కేసీఆర్ సార్.. మీకు కుర్సీ ఏసినం.. సంవత్సరమున్నర ఇంకా కాలేదా సార్’.. అంటూ చర్లగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితులు వినూత్న నిరసన తెలిపారు. చర్లగూడెం ప్రాజెక్టులో ఖుదాబక్షిపల్లి, రాంరెడ్డిపల్లి, శివన్నగూడెం గ్రామాల ప్రజలు గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. 45 రోజులుగా నిరహార దీక్ష చేస్తున్న వారు.. శనివారం దీక్షా శిబిరం వద్ద కుర్చీ వేసి అందులో కేసీఆర్ చిత్రపటం ఉంచారు. ‘ముంపు బాధితులకు ఉద్యోగాలంటివి గదా సారూ.. ఏమాయే ? ఏడాదిన్నర ఇంకా కాలేదా సార్ ?’ అంటూ ప్ల కార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
ఏడాదిన్నర కాలంలో భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఇప్పటివరకు పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు రూ. 12 లక్షలు ఇచ్చి చర్లగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితులకు రూ. 5.05 లక్షలు మాత్రమే ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ముంపు గ్రామాల ప్రజలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.