దేశంలోని అవినీతి సీఎంలలో సీఎం కేసీఆర్ నెంబర్ 1 స్థానంలో ఉన్నాడని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్ ఆరోపించారు. తెలంగాణ ఇంటి పార్టీ 5వ ఆవిర్భావ వేడుకలతో పాటు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఆదర్శర్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారులు నేడు అనాధలుగా మిగిలారని సుధాకర్ అన్నారు. ఉద్యమకారులు తమ హక్కుల సాధనకు గొంతు పెంచాలని సూచించారు. భవిష్యత్ లో ఉద్యమకారులకు ఇంటి పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఉన్న నయీమ్, డేరా బాబా భూములు ఉద్యమకారులకు పంచాలని డిమాండ్ చేశారు. మద్యంపై వచ్చే కమీషన్లతో రాష్ట్రం బతికే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై పీడీ యాక్ట్ పెట్టడంపై హైకోర్టు మొట్టికాయలు వేసిందన్న సుధాకర్ దేశంలో ఉద్యమకారులపై తొలి పీడీ యాక్ట్ తనపైనే నమోదైనట్లు తెలిపారు. ఉద్యమ ద్రోహులు, ల్యాండ్, డ్రగ్, మైనింగ్ మాఫియా నాయకులను రాజ్యాసభకు పంపిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని విమర్శించారు. ఉద్యమకారుల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తే ఏమవుతుందని చెరుకు సుధాకర్ ప్రశ్నించారు.