వైభవంగా చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు

వైభవంగా చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు
  • నేడు అంకురార్పణ కార్యక్రమం
  • విద్యుత్ కాంతుల వెలుగుల్లో ఆలయం
  • భక్తి పారవశ్యంతో ఆలయ పరిసరాలు 
  • అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు

నార్కట్ పల్లి, వెలుగు : తెలంగాణ శైలక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈనెల 9 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే నల్గొండ పట్టణంలో నగరోత్సవం నిర్వహించి ఆలయాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో ఆలయం వెలిగిపోతోంది. చెర్వుగట్టుకు చేరుకున్న స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు అంకురార్పణ ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్యఅతిథులుగా హాజరై గణపతి పూజలో పాల్గొననున్నారు. బుధవారం తెల్లవారుజామున పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. కల్యాణ మండపాన్ని అందంగా అలంకరించారు. 

భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు..

బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. గట్టుపైకి వెళ్లేందుకు వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేకంగా వాహనాలను సిద్ధం చేశారు. సాధారణ భక్తులకు సైతం ఆటోలను అందుబాటులో ఉంచారు. కల్యాణ మండపం వద్ద భక్తులు సమర్పించే తలంబ్రాల బియ్యాన్ని సేకరించేందుకు ప్రత్యేక గాలరీని నిర్మించారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుధ్యంపై ఆలయ అధికారులు దృష్టి సారించారు. 

భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు  

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బ్రహ్మోత్సవాలకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం. 900 మంది సిబ్బందితో గట్టు పరిసరాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాం. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులున్నా తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తాం. ముఖ్యంగా స్వామివారి కల్యాణం, అగ్నిగుండాల రోజు భక్తులు సంయమనం పాటించాలి. 

 డీఎస్పీ శివరాంరెడ్డి