- భక్తి శ్రద్ధలతో అగ్ని గుండం తొక్కే ఘట్టం
నార్కట్ పల్లి, వెలుగు: చెర్వుగట్టు క్షేత్రం శివ నామస్మరణతో మార్మోగింది. హరహర మహాదేవ.. శంభోశంకర అంటూ భక్తజనం పులకించిపోయింది. శివసత్తుల సిగాలు, పోతరాజుల విన్యాసాలతో ఆ ప్రాంతం నాట్యమాడింది. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం చెర్వుగట్టు శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అగ్నిగుండాలు తొక్కే కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ముందుగా దేవాలయ ప్రధాన అర్చకుడు పోతులపాట్టి రామలింగేశ్వర శర్మ, అర్చకులు సతీశ్ శర్మ, శ్రీంకాత్ శర్మ, సురేశ్ శర్మ స్వామివారిని గరుడ వాహనంపై అగ్ని గుండం వరకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అగ్నిగుండం తొక్కే ఘట్టాన్ని ప్రారంభించగా.. భక్తులు శివుడిని తలుచుకుంటూ నిప్పుల్లోనుంచి నడిచారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐ నాగరాజు, ఎస్సై అతిరెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర కుమార్, ఈవో నవీన్,మాజీ సర్పంచ్ నేతగాని కృష్ణయ్య, నాయకులు రేగటె నరసింహారెడ్డి, వారాల రమేశ్, గడుసు శశిధర్ రెడ్డి, నవీన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.