మనకు తిరుగేలేదు చెస్‌‌‌‌‌‌‌‌లో ఇండియా స్వర్ణ శకం మొదలైంది

మనకు తిరుగేలేదు చెస్‌‌‌‌‌‌‌‌లో ఇండియా స్వర్ణ శకం మొదలైంది
  • సమష్టి కృషితోనే  చెస్‌‌‌‌‌‌‌‌ ఒలింపియాడ్‌‌‌‌‌‌‌‌ గెలిచాం
  • వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌  అవ్వడమే నా టార్గెట్‌‌‌‌‌‌‌‌
  • వెలుగు ఇంటర్వ్యూలో  ఇండియా నం.1 చెస్ ప్లేయర్  అర్జున్‌‌‌‌‌‌‌‌

ఎనిమిదేండ్ల వయసులో చెస్‌‌‌‌‌‌‌‌లో అడుగుపెట్టి.. 14 ఏండ్లకే గ్రాండ్‌‌‌‌‌‌‌‌మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోదా అందుకొని.. మరో ఏడేండ్లు తిరిగే సరికే ఇండియా నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌ ఆటగాడిగా నిలిచాడు వరంగల్ కుర్రాడు ఎరిగైసి అర్జున్‌‌‌‌‌‌‌‌.  ఇప్పుడు చెస్‌‌‌‌‌‌‌‌ ఒలింపియాడ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా చారిత్రక స్వర్ణం గెలవడంలో భాగమయ్యాడు.  ఈ టోర్నీ ఓపెన్ సెక్షన్‌‌‌‌‌‌‌‌లో అత్యధిక విజయాలతో అజేయంగా నిలిచిన అర్జున్ సమష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని చెబుతున్నాడు. ఒకేసారి రెండు గోల్డ్ మెడల్స్‌‌‌‌‌‌‌‌ నెగ్గడంతో చెస్‌‌లో ఇండియా స్వర్ణ శకం మొదలైందని,  ఈ ఆటలో  మన దేశానికి ఇక తిరుగేలేదంటున్నాడు. వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్​గా నిలవడమే తన టార్గెట్‌‌‌‌‌‌‌‌ అంటున్నాడు. చెస్‌‌‌‌‌‌‌‌ ఒలింపియాడ్‌‌‌‌‌‌‌‌ ముచ్చట్లు, తన తదుపరి లక్ష్యాలపై ‘వెలుగు’ ఇంటర్వ్యూలో  అర్జున్‌‌‌‌‌‌‌‌ పంచుకున్న మరిన్ని విశేషాలు అతని మాటల్లోనే..

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:చెస్‌‌‌‌‌‌‌‌ ఒలింపియాడ్‌‌‌‌‌‌‌‌లో చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలవాలన్నది  మా అందరి కల. అలాంటి ఒకేసారి రెండు జట్లూ గోల్డ్ మెడల్స్ నెగ్గడం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ విజయంతో చెస్‌‌‌‌‌‌‌‌లో ఇండియా గోల్డెన్‌‌‌‌‌‌‌‌ ఎరా మొదలైందని చెప్పొచ్చు. గత ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో తొలిసారి పోటీపడి ఇండియా కాంస్య  పతకం నెగ్గడంలో భాగం అయ్యాను. అప్పుడు  ఇండివిడ్యువల్ సిల్వర్‌‌‌‌‌‌‌‌ గెలిచా. ఈసారి జట్టుతో పాటు వ్యక్తిగతంగా గోల్డ్‌‌‌‌‌‌‌‌ నెగ్గడం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు సమష్టిగా ఆడటం వల్లే ఈ విజయం సాధ్యమైంది.  స్వర్ణాలు గెలిచి రెండు జట్లలో ఎక్కువమంది యువకులమే ఉన్నందున దీన్ని గోల్డెన్ జనరేషన్‌‌‌‌‌‌‌‌ అనొచ్చు. మా విజయం పట్ల విశ్వనాథన్ ఆనంద్‌‌‌‌‌‌‌‌ సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన చేతుల మీదుగానే ట్రోఫీ అందుకోవడం గొప్ప అనుభూతి. 

ఒత్తిడి కాదు.. బాధ్యత 

ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌ ఉన్న నాపై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే వాటిని నేను ఎప్పుడూ ఒత్తిడిగా  ఫీలవ్వలేదు.  దాన్ని బాధ్యతగా భావించా. మా వ్యూహాలను పక్కాగా అమలు చేసి ఫలితం రాబట్టే ప్రయత్నం చేశా. ఫలితాల గురించి పట్టించుకోకుండా నిలకడగా ఆడటంపై దృష్టి పెట్టా. వాస్తవానికి ఈ టోర్నీకి ముందు  క్లాసికల్‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో  నేను అంతగా ఫామ్‌‌‌‌‌‌‌‌లో లేను. దాంతో తొలి గేమ్‌‌‌‌‌‌‌‌లో కొంచెం ఇబ్బందిపడ్డాను. కానీ, మూడో గేమ్‌‌‌‌‌‌‌‌ నుంచి పికప్‌‌‌‌‌‌‌‌ అయ్యాను. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు.  డ్రా అయిన రెండు గేమ్స్‌‌‌‌‌‌‌‌లోనూ ఒకదాంట్లో గెలవాల్సింది. కొద్దిలో మిస్సయింది. మొత్తంగా  అన్ని రౌండ్లలో అజేయంగా నిలిచి జట్టు విజయంలో భాగం అయినందుకు హ్యాపీగా ఉంది.

ఆ ఐడియా సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

టీమ్‌‌‌‌‌‌‌‌లో నేను టాప్ రేటెడ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ అయినప్పటికీ నన్ను మూడో బోర్డులో ఆడించాలన్నది మా ప్లాన్‌‌‌‌‌‌‌‌. మూడో బోర్డులోని ప్రత్యర్థులతో ఇది వరకు ఆడిన అనుభవం నాకుంది. అలానే టాప్‌‌‌‌‌‌‌‌ బోర్డులో ప్రత్యర్థుల ఆటపై గుకేశ్‌‌‌‌‌‌‌‌కు అవగాహన ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మా జట్టు కెప్టెన్ శ్రీనాథ్‌‌‌‌‌‌‌‌ గుకేశ్‌‌‌‌‌‌‌‌ను టాప్‌‌‌‌‌‌‌‌ బోర్డులో, నన్ను మూడో బోర్డులో ఆడించాడు. ఇది అద్భుతమైన ఐడియా. మాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. 

 ఎవ్వరినీ తక్కువ అంచనా వేయలేదు

ఈ టోర్నీలో  యూఎస్‌‌‌‌‌‌‌‌ఏ, చైనా నుంచి కఠిన సవాల్ ఎదురైంది. చెస్‌‌‌‌‌‌‌‌లో ఇండియా, అమెరికా, చైనాతో పాటు ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌ బలమైన జట్లు. ఇలాంటి పెద్ద ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు వస్తున్నప్పుడు సహజంగానే బలమైన జట్లపై అందరి ఫోకస్ ఉంటుంది. ఆయా జట్లలోని ఆటగాళ్ల కోసం ప్రత్యేక ప్రణాళికతో వస్తారు. అయితే, మేం ఏ జట్టునూ, ఏ ఒక్క ఆటగాడినీ తక్కువగా అంచనా వేయలేదు. ప్రతీ జట్టునూ సమానంగానే చూశాం. చిన్న జట్టే అని లైట్ తీసుకుంటే ఒక్కోసారి బెడిసికొడుతుంది. యూఎస్‌‌‌‌‌‌‌‌ఏ.. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడిపోవడం అందుకు ఉదాహరణ. దీనివల్లే  యూఎస్‌‌‌‌‌‌‌‌ఏ గోల్డ్ రేసులో వెనుకబడింది. 

‌‌‌‌‌‌‌‌సరదా సరదాగా..

రెండు స్వర్ణాలు గెలిచిన జట్లలో పది మంది ఆటగాళ్లు ఉంటే నేను, హారిక, హరికృష్ణ తెలుగువాళ్లం కావడం గొప్పగా అనిపిస్తోంది. మేం ముగ్గురమే కాదు గుకేశ్‌‌‌‌‌‌‌‌,  ప్రజ్ఞానంద, వైశాలి, మా కెప్టెన్‌‌‌‌‌‌‌‌ శ్రీనాథ్ కూడా తెలుగు అర్థం చేసుకుంటారు. దాంతో అందరం తెలుగులో మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకునే వాళ్లం. టీమ్‌‌‌‌‌‌‌‌ మీటింగ్స్‌‌‌‌‌‌‌‌ వరకు కొంత సీరియస్‌‌‌‌‌‌‌‌గా జరిగినా.. మిగతా సమయాల్లో  మేమంతా చాలా సరదాగా, ఆహ్లాదంగా గడిపాం. మా సక్సెస్‌‌‌‌‌‌‌‌లో టీమ్ బాండింగ్ పాత్ర కూడా ఉంది. 

కుటుంబానికి అంకితం

 ఓపెన్‌‌‌‌‌‌‌‌లో మాకు ముందుగానే గోల్డ్ ఖాయం అయినా.. చివరి రౌండ్‌‌‌‌‌‌‌‌లో విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ కూడా గెలవడంతో మా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దాంతో అర్ధరాత్రి వరకూ మా సెలబ్రేషన్స్ సాగాయి. నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  గొప్ప విజయాన్ని మా కుటుంబానికి అంకితం ఇస్తున్నా. మా అమ్మానాన్న సపోర్ట్‌‌‌‌‌‌‌‌ లేకుండా నేను ఈ స్థాయికి వచ్చే వాడిని కాదు. 

ఆ కోర్సు నన్ను పూర్తిగా మార్చింది

కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరంగా గతేడాది కొంత ఇబ్బంది ఎదుర్కొన్నా. కొన్ని టోర్నీల్లో  ప్రతికూల ఫలితాల నుంచి బయటపడ లేకపోయా. దాంతో  ఓ ఫ్రెండ్ సూచనతో ఈషా ఫౌండే షన్‌‌‌‌‌‌‌‌లో  ఇన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌ కోర్సుకు అటెండ్‌‌‌‌‌‌‌‌ అయ్యా ను. మొత్తం ఏడు దశల్లో ఉండే ఈ కోర్సును ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో  పూర్తి చేసిన తర్వాత నా ఆలోచనా దృక్ఫథం పూర్తిగా మారింది. ఓటముల నుంచి వెంటనే తేరుకుంటున్నా. 
ఓ రకంగా ఈ కోర్సు నన్ను పూర్తిగా మార్చేసింది.

ర్యాంకులు, రేటింగ్స్‌‌‌‌‌‌‌‌ పట్టించుకోను 

ఇండియా నుంచి టాప్‌‌‌‌‌‌‌‌ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, వరల్డ్ నం.4గా ఈ టోర్నీకి వచ్చాను. ఇప్పుడు  మూడో ర్యాంక్‌‌కి చేరుకున్నా. అయితే  ఈ ఆటలో టాప్‌‌‌‌‌‌‌‌10–15 లోని ప్లేయర్ల ర్యాంకులు, రేటింగ్స్ అటు ఇటు మారుతూనే ఉంటాయి. కొన్ని రోజుల ముందు వరకు నేను కనీసం టాప్‌‌‌‌‌‌‌‌10లో కూడా లేను. అందుకే నేను  ర్యాంకులు, రేటింగ్స్‌‌‌‌‌‌‌‌ పట్టించుకోను. అలాగే, నాకు షార్ట్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ గోల్స్‌‌‌‌‌‌‌‌ అంటూ ఏవీ లేవు. పోటీ పడే ప్రతీ టోర్నీలోనూ నిలకడగా రాణించాలనే కోరుకుంటా. నా లైఫ్ టార్గెట్‌‌ మాత్రం వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌ అవ్వడమే. తొందర్లోనే దాన్ని  అందుకుంటానని భావిస్తున్నా.