
బుడాపెస్ట్: చెస్ ఒలింపియాడ్‌లో ఇండియా గ్రాండ్ మాస్టర్, తెలంగాణ కుర్రాడు అర్జున్ సూపర్ పెర్ఫామెన్స్ చేస్తున్నాడు. మెగా టోర్నీలో ఆడిన ఐదో గేమ్‌లోనూ విజయం సాధించగా.. ఇండియా అబ్బాయిల, అమ్మాయిల జట్లు వరుసగా ఐదో విజయం సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఓపెన్ సెక్షన్ ఐదో రౌండ్‌లో ఇండియా 3–1తో అజర్‌బైజాన్‌ను ఓడించింది.
తెల్లపావులతో ఆడిన అర్జున్ 44 ఎత్తుల్లో రౌఫ్ మమెదోవ్‌పై విజయం సాధించాడు. మరో గేమ్‌లో డి. గుకేశ్ 38 ఎత్తుల్లోనే ఐడిన్ సులేమన్లిపై గెలిచాడు. నిజత్ అబసోవ్‌తో గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రా చేసుకోవడంతో జట్టుకు విజయం ఖాయమైంది. చివరి బోర్డులో విదిత్ సంతోష్.. అజర్‌బైజాన్ స్టార్ ప్లేయర్ షక్రియార్ మమెద్యరోవ్‌తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. మరోవైపు విమెన్స్ సెక్షన్‌లో ఇండియా 2.5–1.5 తేడాతో కజకిస్తాన్‌ను ఓడించింది. తన గేమ్‌లో హారిక ఓడినా.. వంతికా అగర్వాల్, వైశాలి గెలిచారు. దివ్య దేశ్‌ముఖ్ తన ప్రత్యర్థితో పాయింట్ పంచుకుంది.