
బుడాపెస్ట్: చెస్ ఒలింపియాడ్‌లో ఇండియా జోరు కొనసాగుతోంది. అమ్మాయిల జట్టు వరుసగా నాలుగో విజయం సాధించింది. శనివారం జరిగిన నాలుగో రౌండ్‌లో ద్రోణవల్లి హారిక నేతృత్వంలోని జట్టు 3.5–0.5తో ఫ్రాన్స్‌ను ఓడించింది. టాప్ బోర్డులో ఆడిన హారిక 52 ఎత్తుల్లో కార్నెట్‌పై గెలిచింది.
తానియా సచ్‌దేవ్ 50 ఎత్తుల్లో బెన్మెస్బాను ఓడించగా.. మిలియెట్ సోఫీతో గేమ్‌ను వైశాలి డ్రా చేసుకోవడంతో ఇండియా విజయం ఖరారైంది. దివ్య దేశ్‌ముఖ్ 56 ఎత్తుల్లో మెజాజిపోర్‌ను ఓడించి జట్టుకు ఘన విజయం అందించింది. ఓపెన్ సెక్షన్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ నాలుగో విక్టరీ ఖాతాలో వేసుకున్నాడు. సెర్బియాతో పోరులో నల్లపావులతో ఆడిన అర్జున్ 4 ఎత్తుల్లోనే అలెగ్జాండర్ ఇండ్జిక్‌ను ఓడించాడు. సరనా అలెక్సీతో గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు.