
బుడాపెస్ట్: చెస్ ఒలింపియాడ్‌లో ఇండియా జట్లకు తిరుగులేకుండా పోయింది. టోర్నీలో అబ్బాయిల, అమ్మాయిల జట్లు వరుసగా ఆరో విజయంతో డబుల్ హ్యాట్రిక్ సాధించాయి. ఓపెన్ సెక్షన్‌లో ఇండియా మెన్స్ టీమ్ 3–1తో హంగేరిని చిత్తుగా ఓడించింది. తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ వరుసగా ఆరో విక్టరీ ఖాతాలో వేసుకున్నాడు. ఆరో రౌండ్‌లో నల్లపావులో ఆడిన అర్జున్ ఆఖర్లో మ్యాజిక్ చేసి 57 ఎత్తుల్లో సనమ్ సుగిరోవ్‌ను ఓడించాడు. విదిత్ సంతోష్ 52 ఎత్తుల్లో గెడురాను ఓడించాడు.
నల్లపావులతో ఆడిన గుకేశ్ 44 ఎత్తుల్లో రిచర్డ్ రాపోర్ట్‌తో డ్రా చేసుకోగా.. ప్రజ్ఞానంద 45 ఎత్తుల్లో పీటర్ లెకోతో పాయింట్ పంచుకున్నారు. మరోవైపు అమ్మాయిల జట్టు 2.5–1.5 తేడాతో అర్మేనియాపై ఉత్కంఠ విజయం సాధించింది. తెల్ల పావులతో ఆడిన ద్రోణవల్లి హారిక 44 ఎత్తుల్లో లిలిట్‌తో డ్రా చేసుకోగా.. రెండో బోర్డులో ఆర్. వైశాలి కూడా తన ప్రత్యర్థి మరియమ్‌తో పాయింట్ పంచుకుంది. అయితే, దివ్యా దేశ్‌ముఖ్ 40 ఎత్తుల్లో ఎలినాను ఓడించి జట్టును ఆధిక్యంలోకి తెచ్చింది. చివరి బోర్డులో తానియా సచ్‌దేవ్ 61 ఎత్తుల్లో అనా సర్గస్యన్‌తో డ్రా చేసుకోవడంతో ఇండియా గెలిచింది.