ఈ మెగా టోర్నీలో ఇండియా మెన్స్ టీమ్ గోల్డ్ నెగ్గడంలో తెలంగాణ కుర్రాడు అర్జున్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో రెండోసారి బరిలో దిగడంతో పాటు ఇండియా తరఫున టాప్ ర్యాంకర్ అయిన అర్జున్‌పై జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. వరంగల్‌కు చెందిన 21 ఏండ్ల అర్జున్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. జట్టు వ్యూహంలో భాగంగా మూడో బోర్డులో పోటీ పడ్డ ఓరుగల్లు కుర్రాడు ఏ జట్టుతో ఆడినా.. ఎదురుగా ఎలాంటి ప్రత్యర్థి ఎదురైనా ప్రశాంతంగా ఆడుతూ ఫలితం రాబట్టాడు. 11 రౌండ్లలో ఒక్క ఓటమి లేకుండా అజేయంగా నిలిచాడు. ఆరంభం నుంచి చివరి వరకు తన మార్కు చూపెట్టాడు.
ముఖ్యంగా తొలి ఆరు రౌండ్లలోనూ గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధించి జట్టుకు ఊపు తెచ్చాడు. తోటి ఆటగాళ్లు తడబడినా తెలంగాణ కుర్రాడు మాత్రం ఎక్కడా తగ్గలేదు. పదో రౌండ్‌లో బలమైన అమెరికాతో మ్యాచ్‌లో 1.5–1.5తో ఇండియా సమంగా నిలిచిన దశలో తీవ్ర ఒత్తిడిలో ఆ జట్టు గ్రాండ్ మాస్టర్ లీనియర్ పెరెజ్‌ను ఓడించి స్వర్ణం ఖాయం చేశాడు. మొత్తంగా 9 విజయాలు, 2 డ్రాలతో 10 పాయింట్లతో బోర్డు-3లో టాప్ ప్లేస్‌తో వ్యక్తిగత స్వర్ణం కూడా అర్జున్ సొంతమైంది. చెన్నైలో జరిగిన గత ఎడిషన్‌లో సిల్వర్ (బోర్డు3) మెడల్‌ను ఈసారి గోల్డ్‌కు పెంచుకున్నాడు. అర్జున్‌తో పాటు 18 ఏండ్ల గుకేశ్ కూడా ఈ టోర్నీలో అజేయంగా నిలిచాడు.
10 రౌండ్లలో ఆడిన అతను 8 విజయాలు, 2 డ్రాలతో టాప్ బోర్డులో వరుసగా రెండో ఎడిషన్‌లోనూ గోల్డ్ నెగ్గాడు . క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో గెలిచి ఫిడే వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు అర్హత సాధించిన గుకేశ్ టాప్ బోర్డులో ఇండియాను ముందుండి నడిపించాడు. బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొంటూ జట్టుకు అవసరమైన విజయాలను అందించాడు. ఇక అమ్మాయిల జట్టు విజయంలో యంగ్‌స్టర్స్ దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్‌దే క్రెడిట్ అనొచ్చు. టాప్ 1,2 బోర్డుల్లో హారిక, వైశాలి ఒక్కోసారి తడబడినా.. 19 ఏండ్ల దివ్య, 21 ఏండ్ల వంతిక మాత్రం అద్భుతం చేశారు. 11 రౌండ్లలో అజేయంగా నిలిచిన దివ్య 8 విజయాలు, 3 డ్రాలతో బోర్డ్–3లో గోల్డ్ నెగ్గగా, బోర్డ్–4లో ఆడిన 9 రౌండ్లలో 6 విజయాలు, 3 డ్రాలు సాధించిన వంతిక కూడా స్వర్ణం కైవసం చేసుకుంది. మొత్తంగా రెండు జట్లలోనూ యువకులే ఎక్కువ ఉండి.. విజయంలో కీలక పాత్ర పోషించడం చదరంగంలో ఇండియాకు బంగారు భవిష్యత్తు ఉందని చొప్పుచ్చు. ఇక, ఇరు జట్లలోని పది మందిలో అర్జున్, హారిక, హరికృష్ణ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లు కాగా.. చెన్నైకి చెందిన గుకేశ్ తల్లిదండ్రులు తెలుగు వాళ్లే. ఈ లెక్కన స్వర్ణ చరిత్రలో నలుగురు తెలుగు ప్లేయర్లు భాగం అయ్యారని చెప్పొచ్చు.