- గోల్డ్ నెగ్గిన అబ్బాయిల, అమ్మాయిల జట్లు
- తొలిసారి స్వర్ణాలు గెలిచి కొత్త చరిత్ర
- వరంగల్ కుర్రాడు అర్జున్‌కు వ్యక్తిగత స్వర్ణం
- గుకేశ్, దివ్య, వంతికకు కూడా
బుడాపెస్ట్: చదరంగం పుట్టిన దేశం ఎట్టకేలకు ఈ ఆటలో అత్యుత్తమ ఖ్యాతిని గడించింది. చెస్‌లో ఒలింపిక్స్ స్థాయి ఈవెంట్ అయిన చెస్ ఒలింపియాడ్‌లో ఇండియా స్వర్ణ చరిత్ర సృష్టించింది. ఒకేసారి అటు అబ్బాయిల, ఇటు అమ్మాయిల జట్లు బంగారు పతకాలు గెలిచి డబుల్ ధమాకా మోగించాయి. ఆదివారం ముగిసిన ఈ మెగా టోర్నీలో ఓపెన్, విమెన్ ఈవెంట్లలో ఇండియా చాంపియన్‌గా నిలిచింది. ఓపెన్‌లో ఎరిగైసి అర్జున్, దొమ్మరాజు గుకేశ్, పెంటేల హరికృష్ణ, ఆర్. ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతీతో కూడిన మెన్స్ టీమ్ 11 రౌండ్లలో 22 పాయింట్లకు గాను అత్యధికంగా 21 పాయింట్లు సాధించి అగ్రస్థానం కైవసం చేసుకుంది. 11 రౌండ్లలో అజేయంగా నిలిచి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన అర్జున్ మూడో బోర్డులో, గుకేశ్ టాప్ బోర్డులో వ్యక్తిగత స్వర్ణాలు కూడా అందుకున్నారు. మరోవైపు హారిక నేతృత్వంలోని విమెన్స్ టీమ్ చివరి రౌండ్‌లో కీలక విజయంతో 19 పాయింట్లతో గోల్డ్ ఖాతాలో వేసుకుంది. ఈ జట్టులో ఆర్. వైశాలి, దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్, తానియా సచ్‌దేవ్ ఉన్నారు. దివ్య, వంతిక 3,4వ బోర్డుల్లో వ్యక్తిగత స్వర్ణాలు గెలిచారు. కాగా, మెగా టోర్నీలో ఇది వరకు ఇండియా మెన్స్ టీమ్ 2014, 2022 ఎడిషన్లలో కాంస్య పతకాలు గెలిచింది. అమ్మాయిల జట్టు చెన్నైలో జరిగిన 2022 ఎడిషన్‌లో కాంస్యం నెగ్గింది.
అమ్మాయిల మ్యాజిక్
స్వర్ణం నెగ్గాలంటే చివరి రౌండ్‌లో విజయం అనివార్యమైన దశలో అమ్మాయిల జట్టు అద్భుతం చేసింది. 11వ రౌండ్‌లో ఇండియా 3.5–0.5 తేడాతో అజర్‌బైజాన్‌ను ఓడించింది. టాప్ బోర్డులో హారిక 51 ఎత్తుల్లో గునయ్ మమ్మద్జడాపై నెగ్గగా, యంగ్‌స్టర్ దివ్యా దేశ్‌ముఖ్ 39 ఎత్తుల్లోనే గోవర్ బెదులాయెవాను చిత్తు చేసింది. నల్లపావులతో ఆడిన వంతిక అగర్వాల్ 53 ఎత్తుల్లో ఖనిమ్‌పై గెలవగా, వైశాలి49 ఎత్తుల తర్వాత ఉల్వియా ఫటాలియేవాతో పాయింట్ పంచుకుంది. గోల్డ్ కోసం ఇండియాతో పోటీ పడ్డ కజకిస్తాన్ చివరి రౌండ్‌లో 2–2తో అమెరికాతో డ్రా చేసుకొని 18 పాయింట్లతో సిల్వర్‌తో సరిపెట్టుకుంది. యూఎస్‌ఏ (17 పాయింట్లు) మూడో స్థానంతో కాంస్యం గెలిచింది.
గొప్ప విజయం
టీమిండియాకు అభినందనలు. అర్జున్, గుకేశ్ ఆట అద్భుతం. విదిత్ కూడా బాగా ఆడాడు. మీ ఫలితం ఆకట్టుకుంది. విమెన్స్ టీమ్‌కు కూడా కంగ్రాట్స్. అమ్మాయిలు గొప్ప విజయం సాధించారు. దివ్య, వంతిక పెర్ఫామెన్స్ సూపర్బ్. విశ్వనాథన్ ఆనంద్
కల నిజమైంది
20 ఏండ్ల కిందట నాకు 13 ఏండ్ల వయసులో ఒలింపియాడ్ మెడల్ నెగ్గాలన్న కలతో తొలిసారి ఒలింపియాడ్‌కు వచ్చా. చివరకు ఈ రోజు నా కల నిజమైంది. ఈ టోర్నీ చాలా ఉత్కంఠగా సాగింది. కీలకమైన గేమ్స్‌లో అమ్మాయిలు గెలిచినందుకు సంతోషంగా ఉంది. చివరి గేమ్‌లో మేమంతా సమష్టిగా ఆడి గెలిచాం. అది చాలా గొప్ప విషయం. బలమైన జట్లపై సత్తాచాటాం కాబట్టి ఈ విజయానికి మేం అర్హులం. హారిక
కుర్రాళ్ల జైత్రయాత్ర
పదో రౌండ్‌తోనే పసిడి ఖాయం చేసుకున్న ఇండియా మెన్స్ టీమ్ చివరి రౌండ్‌లో 3.5–0.5 తేడాతో స్లొవేనియాను చిత్తు చేసింది. నల్లపావులతో ఆడిన అర్జున్ 49 ఎత్తుల్లోనే జాన్ సుబెల్జ్‌ను ఓడించగా.. గుకేశ్ 48 ఎత్తుల్లో ఫెడొసీవ్‌పై నెగ్గాడు. ప్రజ్ఞానంద 53 ఎత్తుల్లో ఆంటోన్ డెమ్చెన్కో పని పట్టగా.. విదిత్ సంతోష్ 59 ఎత్తుల్లో తన ప్రత్యర్థి మజెట్‌తో డ్రా చేసుకున్నాడు. మొత్తంగా పది రౌండ్లలో గెలిచిన అబ్బాయిల జట్టు ఒక్క డ్రా (ఉజ్బెకిస్తాన్‌తో తొమ్మిదో రౌండ్) మాత్రమే చేసుకుంది. 11 రౌండ్లలో కలిపి 44 గేమ్స్ ఆడితే ఇండియా ఒకే ఒక్క గేమ్‌లో ఓడింది. యూఎస్‌ఏ రజతం, ఉజ్బెకిస్తాన్ కాంస్యం గెలిచాయి.
మూడో ర్యాంక్‌కు అర్జున్
ఇండియాకు హిస్టారిక్ గోల్డ్ అందించిన అర్జున్, గుకేశ్ తమ వరల్డ్ ర్యాంక్స్ కూడా పెంచుకున్నారు. ఒలింపియాడ్ పెర్ఫామెన్స్‌తో అర్జున్ ఫిడే లైవ్ రేటింగ్‌లో 2797 ఎలో రేటింగ్ పాయింట్లకు చేరుకొని నాలుగు నుంచి మూడో ర్యాంక్ అందుకున్నాడు. ఈ క్రమంలో అమెరికా స్టార్ ఫాబియోనో కరువానాను వెనక్కునెట్టాడు.
గుకేశ్ 2794 ఎలో రేటింగ్‌తో ఏడు నుంచి ఐదో స్థానానికి చేరుకున్నాడు.