- హోరాహోరీగా చెస్ వరల్డ్ కప్ ఫైనల్
- నేడు టై బ్రేక్స్‌తో తేలనున్నవరల్డ్ కప్ విన్నర్
బాకు (అజర్‌బైజాన్): ఫిడే చెస్ వరల్డ్‌కప్‌లో ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందను టైటిల్ ఊరిస్తోంది. మెగా టోర్నీలో అద్భుత పెర్ఫామెన్స్‌తో ఫైనల్‌కు దూసుకెళ్లిన ప్రజ్ఞా ప్రపంచంలోనే మేటి ఆటగాడు, నార్వే లెజెండ్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో నువ్వానేనా అన్నట్టుగా పోరాడుతున్నాడు. బుధవారం ఇరువురి మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ రెండో గేమ్ కూడా డ్రా అయింది. 30 ఎత్తుల వద్ద 18 ఏండ్ల ప్రజ్ఞా, కార్ల్‌సన్ డ్రాకు అంగీకరించడంతో క్లాసికల్ గేమ్ విన్నర్‌ను తేల్చలేకపోయింది. తొలి గేమ్ 70 ఎత్తుల తర్వాత డ్రా అయింది. ఐదుసార్లు వరల్డ్ చాంపియిన్ అయిన కార్ల్‌సన్ తెల్లపావులతో రెండో గేమ్‌ను మెరుగ్గా ఆరంభించాడు. పోటీ ప్రారంభంలో ప్రజ్ఞానంద టైమ్‌లో ముందున్నప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. చివరకు వచ్చే సరికి వెనుకబడి డ్రాకు అంగీకరించాడు. గురువారం జరిగే రెండు టై బ్రేక్‌ల ద్వారా వరల్డ్ కప్ విజేత ఎవరో తేలనుంది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన రెండో ఇండియన్ అయిన ప్రజ్ఞానంద.. టై బ్రేక్స్‌లో మాగ్నస్‌ను ఓడిస్తే వరల్డ్ కప్ గెలిచిన యంగెస్ట్ ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు.
ఇంత త్వరగా డ్రా ఊహించలేదు: ప్రజ్ఞా
కార్ల్‌సన్ అంత తొందరగా డ్రాకు వెళ్తాడని ఊహించలేదన్నాడు. ఈ ఫలితం పట్ల తాను కూడా సంతృప్తిగానే ఉన్నానని చెప్పాడు. ఇక్కడి వాతావరణం కారణంగా కార్ల్‌సన్‌తో పాటు తాను కూడా ఇబ్బంది పడ్డానని తెలిపాడు. ‘నేను కూడా అలసిపోయాను. అయినా రేపు నేను శక్తిమొత్తం ధారపోసి ఆడుతా. ఆ తర్వాతే రెస్ట్ తీసుకుంటా. రెండో గేమ్‌లో కార్ల్‌సన్‌లో అంతగా ఎనర్జీ కనిపించలేదు. రేపటి వరకు తను కోలుకుంటాడని నేను అనుకుంటున్నా. ఇలాంటి ఫైనల్స్‌కు ముందు భవిష్యత్తులో ఒక రోజు విశ్రాంతి ఇస్తే బాగుంటుంది. ఈ టోర్నీతో ఇండియా మీడియా దృష్టి ఎక్కువగానాపైనే ఉందని తెలుసు. నేను దానికి అలవాటు పడ్డాను. అయితే, దేశంలో చాలా మంది చెస్‌ను ఫాలో అవడం బాగుంది. ఆ ఆట పాపులర్ అవుతుందన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా’ అని ప్రజ్ఞా చెప్పుకొచ్చాడు. ఈ టోర్నీలో ఇప్పటికే వరల్డ్ నం.2 హికారు నకాముర, నం.3 ఫాబియానో కరువానాను ఓడించి ఫైనల్ బెర్తు దక్కించుకున్న ప్రజ్ఞానంద కెనడాలో జరిగే 2024 క్యాండిడేట్స్ టోర్నీకి క్వాలిఫై అయ్యాడు.
ప్రజ్ఞా చాలా స్ట్రాంగ్: మాగ్నస్
ఈ టోర్నీలో ఇప్పటికే పలువురు టాప్ ప్లేయర్లతో ప్రజ్ఞానంద టై బ్రేక్స్ ఆడాడని, అతను చాలా బలమైన ఆటగాడని తనకు తెలుసని కార్ల్‌సన్ చెప్పాడు. ‘ఇక్కడి వాతావరణంతో నేను అసౌకర్యానికి గురయ్యా. డాక్టర్ల ట్రీట్మెంట్తో ఈ రోజు కొంచెం మెరుగయ్యా. అయినా పూర్తిగా కోలుకున్నట్టు అనిపించలేదు. ఈ రాత్రి రెస్ట్ తీసుకొని రేపు పూర్తి బలంతో ఆడతానని అనుకుంటున్నా’ అని కార్ల్‌సన్ తెలిపాడు.
టై బ్రేక్స్ ఇలా
టై బ్రేక్స్‌లో రెండు ర్యాపిడ్ గేమ్స్ ఆడిస్తారు. ప్రతి ఆటగాడికి 25 నిమిషాల టైమ్ కంట్రోల్‌తో పాటు ప్రతి ఎత్తుకు 10 సెకండ్ల టైమ్ ఇంక్రిమెంట్ ఉంటుంది. వీటిలో కూడా విజేత తేలకుంటే ప్రతీ ప్లేయర్‌కు 5 నిమిషాల టైమ్ కంట్రోల్‌తో మరో రెండు గేమ్స్ ఆడిస్తారు. తొలి ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు సెకండ్ల 3 టైమ్ ఇంక్రిమెంట్ ఉంటుంది.