Ranji Trophy 2024-25: పుజారా డబుల్ సెంచరీ.. లారా రికార్డ్ బ్రేక్

Ranji Trophy 2024-25: పుజారా డబుల్ సెంచరీ.. లారా రికార్డ్ బ్రేక్

వెటరన్ ప్లేయర్ ఛెతేశ్వర్ పుజారాకు టీమిండియా దారులు దాదాపుగా మూసుకుపోయినట్టే. అయినప్పటికీ అతను భారత జట్టులోకి రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దేశవాళీలో పరుగుల వర్షం పారిస్తున్నాడు. సెంచరీల సెంచరీలు కొడుతూ సెలక్టర్లకు ఛాలెంజ్ విసురుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభమైన రంజీ సీజన్ లో అసాధారణంగా బ్యాటింగ్ చేస్తూ త్వరలో టీమిండియా తలుపు తట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. సోమవారం (అక్టోబర్ 21) రాజ్‌కోట్‌ వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ(200*) బాది తన అవసరం జట్టుకు ఉందని తెలియజేశాడు.

పుజారా ఫస్ట్ క్లాస్ కెరీర్ లో ఇది 18 వ డబుల్ సెంచరీ.. భారత్ తరపున అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన అతను ఓవరాల్ గా  లిస్టులో అత్యధిక డబుల్ సెంచరీ చేసిన ఆటగాళ్లలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. 17 ఫస్ట్-క్లాస్ డబుల్ సెంచరీలు చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్లు మార్క్ రాంప్రకాష్, హెర్బర్ట్ సట్‌క్లిఫ్‌లను అధిగమించాడు. డాన్ బ్రాడ్‌మాన్ (37),వాలీ హమ్మండ్ (36),ప్యాట్సీ హెండ్రెన్ (22) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.  

ALSO READ | IND Vs NZ: రెండో టెస్టుకు నో ఛాన్స్.. రాహుల్ చివరి టెస్ట్ ఆడేశాడా..

అంతకముందు 197 బంతుల్లో 66వ ఫస్ట్-క్లాస్ సెంచరీని పూర్తి చేసుకున్న పుజారా.. లారా (65) రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇదే మ్యాచ్‌లో పుజారా ఫస్ట్-క్లాస్ క్రికెట్ లో 21,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 

పుజారా చివరిసారిగా భారత్ తరపున 2023 లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో 14, 27 పరుగులు చేసి నిరాశపరించిన ఈ  వెటరన్ బ్యాటర్ కు ఆ తర్వాత జరిగిన వెస్టిండీస్ టూర్ కు సెలక్టర్లు గట్టి షాకిచ్చారు. పూజారాపై వేటు వేసి కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారు. ఇటీవలే సౌతాఫ్రికా టూర్ కు సైతం పుజారాకు సెలక్టర్లు పట్టించుకోలేదు. దీంతో ఇక పుజారా టెస్ట్ కెరీర్ ముగిసిపోయిందని అంతా భావించినా..రంజీ సీజన్ లో సత్తా చాటి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.