డబుల్ సెంచరీతో అదరగొట్టిన పుజారా.. టీమిండియాలోకి రీ ఎంట్రీ..?

డబుల్ సెంచరీతో అదరగొట్టిన పుజారా.. టీమిండియాలోకి రీ ఎంట్రీ..?

టీమిండియా నయా వాల్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా భారత టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత చెలరేగి ఆడుతున్నాడు. తనలో ఇంకా సత్తా ఉందని నిరూపిస్తూ దేశవాళీ క్రికెట్ లో ఏకంగా డబుల్ సెంచరీ బాదేశాడు. జార్ఖండ్ పై జరిగిన తొలి మ్యాచ్ లో 356 బంతుల్లో 30 ఫోర్లతో 243 పరుగులు చేసి భారత టెస్టు జట్టులో పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. 157 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో ఆదివారం బ్యాటింగ్ ప్రారంభించిన పుజారా మొదటి సెషన్‌లోనే డబుల్ సెంచరీని అందుకున్నాడు. 

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లకు జట్టును త్వరలో ఎంపిక చేయనుంది.  ఈ సిరీస్ కు పుజారా భారత జట్టులో ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే అభిప్రాయలు వినిపిస్తున్నాయి. ఇటీవలే జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్ లో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వగా.. గిల్, జైస్వాల్ లాంటి యంగ్ ప్లేయర్లు విఫలం కావడం పుజారాకు కలిసి రానుంది. పుజారా భారీ సెంచరీతో సౌరాష్ట్ర పటిష్ట స్థితిలో నిలిచింది. 578/4 వద్ద తమ స్కోర్‌ను డిక్లేర్ చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్రకు 436 పరుగుల భారీ అధిక్యం లభించింది. 

పుజారా చివరిసారిగా భారత్ తరపున 2023 లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో 14, 27 పరుగులు చేసి నిరాశపరించిన ఈ  వెటరన్ బ్యాటర్ కు ఆ తర్వాత జరిగిన వెస్టిండీస్ టూర్ కు సెలక్టర్లు గట్టి షాకిచ్చారు. పూజారాపై వేటు వేసి కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారు. ఇటీవలే సౌతాఫ్రికా టూర్ కు సైతం పుజారాకు సెలక్టర్లు పట్టించుకోలేదు. దీంతో ఇక పుజారా టెస్ట్ కెరీర్ ముగిసిపోయిందని అంతా భావించినా..డబుల్ సెంచరీతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.