ట్రావిస్ హెడ్.. ఈ ఒక్క పేరు టీమిండియాను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లను అందరినీ కట్టడి చేస్తున్నా హెడ్ వికెట్ తీయడంలో భారత బౌలర్లు విఫలమవుతున్నారు. అడిలైడ్ టెస్టులో భారత ఓటమికి హెడ్ ఒక్కడే కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అడిలైడ్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 140 పరుగులతో భారీ సెంచరీ చేసి ఆసీస్ కు విజయాన్ని అందించాడు. భారత బౌలింగ్ దళం అందరినీ పెవిలియన్ కు చేరుస్తున్న హెడ్ మాత్రం మన జట్టుకు కొరకరాని కొయ్యలా తయారవుతున్నాడు.
టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో సెంచరీ.. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ.. తాజాగా పింక్ బాల్ టెస్టులో సెంచరీ.. ఇలా భారత్ పై మ్యాచ్ అంటే హెడ్ పూనకం వచ్చిన వాడిలా చెలరేగుతున్నాడు. హెడ్ ను భారత్ ఔట్ చేయడానికి టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా ఒక కీలకమైన సలహా ఇచ్చాడు. ఈ ఆసీస్ క్రికెటర్ కు షార్ట్ బాల్స్ సంధించాలని టీమిండియా బౌలర్లకు సూచించాడు.
"ట్రావిస్ హెడ్ కు రెండు-మూడు షార్ట్-పిచ్ డెలివరీలను మాత్రమే చూశాము. షార్ట్ బాల్స్ ఎత్తుగడ హెడ్ విషయంలో బాగా పనికి వస్తుంది. అతను ఎక్కువగా ఆఫ్ సైడ్ ఆధిపత్యం చూపిస్తున్నాడు. ఆఫ్ సైడ్ ఐదుగురు ఫీల్డర్లను.. లెగ్ సైడ్ నలుగురు ఫీల్డర్లను ఉంచడం ఉత్తమం. కానీ భారత్ ఆఫ్ సైడ్ ముగ్గురు ఫీల్డర్లను ఉంచి లెగ్ సైడ్ 6 గురు ఫీల్డర్లను ఉంచింది. ఇక్కడ టీమిండియా తప్పు చేసింది". అని పుజారా తెలిపాడు.
బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య శనివారం (డిసెంబర్ 14) మూడో టెస్టు జరగనుంది. ఇరు జట్లు సిరీస్ లో చెరో మ్యాచ్ గెలిచి 1-1 ఆధిక్యంలో ఉన్నారు. సిరీస్ లో ఆధిక్యం సాధించాలంటే మూడో టెస్ట్ ఇరు జట్లకు చాలా కీలకం. ఈ నేపథ్యంలో భారత్, ఆసీస్ జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. సిరీస్ లోనే కాక టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ అత్యంత రెండు జట్లకు అత్యంత కీలకంగా మారింది.