ఇంగ్లాండ్‌తో టీమిండియా మ్యాచ్.. ప్రాక్టీస్ చేస్తూ కనిపించిన పుజారా

టీమిండియా నయా వాల్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా భారత టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత చెలరేగి ఆడుతున్నాడు. తనలో ఇంకా సత్తా ఉందని నిరూపిస్తూ దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సీజన్ రంజీల్లో ఒక డబుల్ సెంచరీ, ఒక సెంచరీ చేసి టాప్ ఫామ్ లో ఉన్నాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌ కు ఎంపిక చేయని సంగతి తెలిసిందే. అయినా పుజారా నమ్మకం కోల్పోలేదు. నెట్స్ లో చెమటోడుస్తూ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. 

 
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ తో రాజ్‌కోట్‌ వేదికగా మూడో టెస్ట్ ఆడుతున్న సంగతి తెలిసిందే. భారత జట్టుకు దూరమైన వెటరన్ ప్లేయర్ చటేశ్వర్ పుజారా సొంతగడ్డ కూడా ఇదే కావడం విశేషం. ఓ వైపు రాజ్ కోట్ లో మ్యాచ్ జరుగుతుంటే పుజారా మాత్రం తనలోని డెడికేషన్ ను చూపిస్తూ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా మణిపూర్‌తో సౌరాష్ట్ర పోరుకు పుజారా సిద్ధమవుతున్నాడు. పటిష్టమైన డిఫెన్సివ్ తో పాటు దూకుడుగా షాట్‌లను ఆడుతూ కనిపించాడు. ప్రస్తుత సిరీస్ లో సీనియర్లు ఎవరూ లేకపోవడంతో ఫామ్ లో ఉన్న పుజారా వైపు సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. 

పుజారా చివరిసారిగా భారత్ తరపున 2023 లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో 14, 27 పరుగులు చేసి నిరాశపరించిన ఈ  వెటరన్ బ్యాటర్ కు ఆ తర్వాత జరిగిన వెస్టిండీస్ టూర్ కు సెలక్టర్లు గట్టి షాకిచ్చారు. పూజారాపై వేటు వేసి కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారు. ఇటీవలే సౌతాఫ్రికా టూర్ కు సైతం పుజారాకు సెలక్టర్లు పట్టించుకోలేదు. దీంతో ఇక పుజారా టెస్ట్ కెరీర్ ముగిసిపోయిందని అంతా భావించినా..రంజీ సీజన్ లో సత్తా చాటి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.