- ఆ పార్టీ మేనిఫెస్టోలో బీసీల ప్రస్తావనే లేదు
- చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్ది
వికారాబాద్/చేవెళ్ల, వెలుగు: బీజేపీని నమ్ముకుంటే బీసీలకు మిగిలేది బూడిదేనని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. బీజేపీ జాతీయ మేనిఫెస్టోలో బీసీల ప్రస్తావనే లేదన్నారు. బడుగు బలహీనవర్గాలకు న్యాయం జరిగేది కేవలం కాంగ్రెస్పార్టీతోనేనని చెప్పారు. గురువారం వికారాబాద్ లోని ఓ ఫంక్షన్హాల్లో బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రంజిత్‌రెడ్డితోపాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీలకు అవకాశాలు, అధికారం, ఆత్మగౌరవం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. బీసీల పట్ల బీజేపీది భస్మాసుర హస్తమైతే.. కాంగ్రెస్ ది అభయ హస్తమని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో పలు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలాగే చేవెళ్ల మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్నాయకులు రంజిత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
రంజిత్‌రెడ్డికి మాలల మద్దతు
రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రక్షించుకోవాలంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకూడదని మాల ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య పిలుపునిచ్చారు. గురువారం ఆయన మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, గోపోజు రమేశ్‌తో కలిసి వికారాబాద్ లో మీడియాతో మాట్లాడారు. చేవెళ్లలో కాంగ్రెస్అభ్యర్థి జి.రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని దళిత, బహుజనులను విజ్ఞప్తి చేశారు.
దళిత, బహుజనులు మరింత అభివృద్ధిలోకి రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెన్నయ్య పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్‌పార్టీకి రాష్ట్రంలోని 21 రకాల దివ్యాంగుల మద్దతు ఉందని తెలంగాణ వికలాంగుల సంఘాల జేఏసీ కన్వీనర్ నారా నాగేశ్వర్రావు తెలిపారు. గురువారం ఆయన చేవెళ్లలోని కాంగ్రెస్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ను గెలిపించి సామాజిక తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేద్దామని పిలుపునిచ్చారు.