శంషాబాద్, వెలుగు: తన ఎదుగుదలను చూసి ఓర్వలేక, ప్రతిపక్ష పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని చేవెళ్ల కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చెప్పారు. గాలి మాటలు చెబితే ప్రజలు నమ్మరని, సాక్ష్యాధారాలతో నిరూపించాలని సవాల్‌విసిరారు. రాజేంద్రనగర్ కాంగ్రెస్ఇన్చార్జ్ కస్తూరి నరేందర్ ఆధ్వర్యంలో మంగళవారం షాపూర్ గ్రామంలో మహిళా సదస్సు నిర్వహించారు. రంజిత్ రెడ్డితోపాటు, ఆయన సతీమణి, టీటీడీ బోర్డు మెంబర్ సీతారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. గడిచిన ఐదేండ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు.
కరోనా టైంలో ప్రజలకు కనీసం అందుబాటులో లేరని, అపాయింట్మెంట్లేకుండా ఆయన్ని కలిసే పరిస్థితి లేదని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలు రాగానే కొత్త వేషం వేసుకుని ప్రజల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు అయిపోయాక ముఖం చాటేస్తారని, గత ఐదేండ్లుగా తాను ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని చెప్పారు. మరో అవకాశం ఇస్తే చేవెళ్ల ప్రజల గళాన్ని పార్లమెంటులో వినిపిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎల్లయ్య, డీసీసీ అధికార ప్రతినిధి సులోచన, మల్కారం మాజీ సర్పంచ్ యాదగిరిరెడ్డి, జంగయ్య మాజీ సర్పంచ్ యటగారి సిద్ధులు, నాయకులు సంగీత, మహేందర్, చంద్రశేఖర్, లక్ష్మయ్య. సప్తగిరి గౌడ్, అశ్లీ నాయక్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.