తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ అత్యధిక సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో గ్రేటర్ లో నోటాకు 44 వేల ఓట్లు రావడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ లోని చాలా సెగ్మెంట్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లాంటి ప్రధాన పార్టీల తర్వాతి స్థానంలో నోటా నిలిచింది.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో నోటాకు15,418 ఓట్లు రాగా, అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో12,824 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్ జిల్లాలో 16,222 ఓట్లు నోటాకు పడ్డాయి. సెగ్మెంట్ల పరంగా చూస్తే... కుత్బుల్లాపూర్లో అత్యధికంగా నోటాకు 4,079 ఓట్లు రాగా, అత్యల్పంగా నాంపల్లిలో 544 ఓట్లు వచ్చాయి. అయితే 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి గ్రేటర్ లో నోటాకు ఓట్లు కొంత తగ్గినా.. ఉనికి మాత్రం చాటింది. గతంలో పోలిస్తే 471 ఓట్లు తగ్గాయి.
ALSO READ :- కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపిక ఖరారు.. సాయంత్రం పేరు వెల్లడించే చాన్స్
నోటాకు కొన్ని చోట్ల వేలల్లో ఓట్లు వచ్చాయి. మేడ్చల్‌లో 3,737 ఓట్లు, శేరిలింగంపల్లిలో 3,145, ఎల్బీనగర్లో 2,966, మల్కాజ్ గిరిలో 2,608, కూకట్‌పల్లిలో 2,458, ఉప్పల్‌లో 2,536, మహేశ్వరంలో 2,031 ఓట్లు నోటాకు వచ్చాయి. అలాగే వెయ్యి నుంచి రెండు వేలలోపు నోటాకు పడిన సెగ్మెంట్లు 10 ఉండగా, ఐదొందల నుంచి వేయిలోపు పడిన సెగ్మెంట్లు 6 ఉన్నాయి.
చేవెళ్లలో మెజారిటీని దాటిన నోటా...
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ కంటే నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ. ఈ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్యకు 76,218 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్‌కు 75,950 ఓట్లు వచ్చాయి. కేవలం 268 ఓట్ల అతిస్వల్ప మెజారిటీతో కాలె యాదయ్య కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక్కడ నోటాకు1,423 ఓట్లు రావడం గమనార్హం.
యాకుత్‌పురాలో ఎంఐఎం అభ్యర్థి 878 ఓట్ల మెజారిటీతో గెలవగా, ఇక్కడ నోటాకు 704 ఓట్లు పోలయ్యాయి. చేవెళ్లలాంటి పరిస్థితే గతంలో అంబర్‌పేట సెగ్మెంట్లో కిషన్ రెడ్డికి కూడా ఎదురైంది. ఇలా గెలుపు ఓటములను డిసైడ్ చేసే స్థాయిలో నోటా ఓట్లు ఉంటుండటంతో నోటా పేరు చెబితేనే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.