దళితులపై ఎమ్మెల్యే యాదయ్య ఆగ్రహం

వికారాబాద్, వెలుగు: దళిత బంధు స్కీమ్​కు ప్రభుత్వ ఉద్యోగిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించిన దళితులపై చేవెళ్ల ఎమ్యెల్యే కాలె యాదయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వికారాబాద్ కొత్త కలెక్టరేట్ ఆవరణలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ బిల్డింగ్ శంకుస్థాపనకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. అక్కడికి నవాబుపేట మండలంలోని చిట్టిగిద్ద గ్రామానికి చెందిన పలువురు దళితులు వచ్చారు. తమ గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి దళిత బంధు ఇస్తున్నారని మంత్రికి వాళ్లు ఫిర్యాదు చేశారు. ఆ కంప్లయింట్ పేపర్​ను అక్కడే ఉన్న ఎమ్మెల్యే యాదయ్యకు ఇచ్చిన మంత్రి.. అదేంటో చూడమని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగిని ఎట్ల ఎంపిక చేస్తరని ప్రశ్నించారు. అయితే ‘‘ఈ ఫిర్యాదు ఎవడిచ్చాడు” అంటూ కంప్లయింట్ చేసిన దళితులపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ‘‘నా ఇష్టం ఉన్నోళ్లకు ఇస్త.. అంతా నా ఇష్టం” అంటూ దురుసుగా సమాధానం ఇచ్చారు. ఇదంతా మంత్రి సమక్షంలోనే జరిగింది. దీంతో చేసేదేం లేక ఫిర్యాదుదారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.